పల్లెపోరుకు సన్నద్ధం
● షెడ్యూల్ రాగానే నిర్వహణకు రెడీ ● ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం ● ఇప్పటికే ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల ● బ్యాలెట్ బాక్స్‌లు, గుర్తులు, నోడల్ అధికారుల నియామకం ● రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ
సాక్షి, పెద్దపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తిచేయాలనే లక్ష్యంతో సర్కారు ముందుకు సాగుతోంది. మరోవైపు.. షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉంది. ఇందుకోసం పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తోంది.
ఓటరు జాబితా నుంచి గుర్తుల కేటాయింపు వరకు..
జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఓటరు జాబితా విడుదల చేసింది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, నోడల్ అధికారుల నియామకం, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసింది. తాజాగా అభ్యర్థులకు గుర్తులు, బ్యాలెట్ పేపర్లు ప్రిటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయగా.. ఆ మేరకు పంచాయతీ అధికారులు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. దీంతో గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు.
సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా సర్పంచ్ ఎన్నికల కోసం 30 గుర్తులు, వార్డు సభ్యులను ఎన్నుకునేందుకు వీలుగా 20 గుర్తులను అధికారులు కేటాయించారు. సర్పంచ్ కోసం గులాబీ రంగు, వార్డు సభ్యుడి కోసం తెల్ల కాగితంపై గుర్తులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. బ్యాలెట్ పత్రాల ఏర్పాటు, ముద్రణ తదితర వాటికి జిల్లాస్థాయిలో టెండర్లు ఆహ్వానించే ఏర్పాట్లు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో పాటు నోటా గుర్తును బ్యాలెట్ పేపర్ చివరన ముద్రించనున్నారు.
200 మందికి ఒక పోలింగ్ కేంద్రం
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీవార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,200 మంది ఓటర్లుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 200 మంది ఓటర్లకే ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్ వేగవంతంగా పూర్తిచేయొచ్చని భావిస్తున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వం రెండు దఫాలు వర్తించేలా రిజర్వేషన్లు ఖరారు చేసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టి, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇప్పటికే కులగణనపై కమిటీని నియమించి, కులగణన చేపట్టింది. దీనికితోడు జిల్లాలో కొత్తగా గుంజపడుగు, గర్రెపల్లి, రాఘవాపూర్ మండలాలతోపాటు 12 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా మారుతాయని రాజకీయ నేతలు లెక్కలు కడుతున్నారు.
గ్రామాల్లో ఎన్నికల సందడి..
రిజర్వేన్లు మారుతాయననే సమాచారంతో రాజకీయ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు ఎవరిలెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. మద్దతుకోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల వద్దకు చక్కర్లు కొడుతున్నారు. నాయకులను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా పోటీ చేసే అవకాశం దక్కించుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాయకుల ఫొటోలతో ఫ్లెక్సీలు ముద్రించి ప్రధాన కూడళల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఆశావహులను ఎవరినీ వదులుకోకుండా అందరికీ హామీలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జిల్లా సమాచారం
గ్రామపంచాయతీలు 269
వార్డులు 2,486
మొత్తం ఓటర్లు 4,13,084
పురుషులు 2,03,430
మహిళలు 2,09,641
ఇతరులు 13
షెడ్యూల్ ఎప్పుడొచ్చినా సిద్ధమే
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తుగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఓటరు జాబితా విడుదల చేశాం. గతంలో జరిగిన పొరపాట్లకు తావులేకుండా కుటుంబ సభ్యులంతా ఒకేపోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కు వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
– బుచ్చయ్య, డీపీవో
Comments
Please login to add a commentAdd a comment