రోడ్‌షోలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి సంజయ్‌కుమార్
50 ఏళ్లలో వందసార్లు రాజ్యాంగాన్ని మార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది..
ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కాంగ్రెస్ కొంటోంది
ఒక్కో కార్పొరేటర్ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ
కొత్తపల్లి బహిరంగ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు
కరీంనగర్ టౌన్: ‘సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్ వారసుడు.. రిజర్వేషన్ల రద్దు చేయబోతోందంటూ బీజేపీపై విషప్రచారం చేస్తుండు.. లౌకిక పదాన్ని తొలగిస్తామన్నందుకు బీజేపీ నేతలను ఏ చెప్పుతో కొట్టాలంటున్నడు.. నేనడుగుతున్నా... 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లకుపైగా రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలను ఎన్నిసార్లు చెప్పుతో కొట్టాలి?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. అధికారంలోకి వస్తే ‘సెక్యులర్’ పదాన్ని తొలగిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ అంటే... రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌కి సవరణకు, పూర్తిగా మార్చేయడానికి తేడా కూడా తెల్వదని ఎద్దేవా చేశారు.‘రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదనీ, ఇకపై రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఎవరైనా అంటే చీపురు, చెప్పులతో ఉరికించి కొట్టండని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
కార్పొరేటర్లను పశువుల్లా కొంటున్నారు
ఫోన్ ట్యాపింగ్ సొమ్ముతో కరీంనగర్‌లో కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని బండి ధ్వజమెత్తారు. ఒక్కో కార్పొరేటర్‌కు 20 లక్షలు ఇస్తే.. అందులో రూ.5లక్షలు బ్యాంకు ఖాతా లో జమచేసినట్లు చర్చ సాగుతోందని, వెంటనే బ్యాంక్ లావాదేవీలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలన్నారు. కరీంనగర్ అభివృద్ధికి రూ.12వేల కోట్లు తీసుకొచ్చానని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్య ర్థులు మీ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ‘మీ కోసం కొట్లాడింది మేం. మీ కోసం జైలుకు పోయింది మేం. నాపైన 109 కేసులు పెట్టినా భయపడలే. మరీ కాంగ్రెస్‌కు ఓటేయడం ఎంత వరకు న్యాయం?’ అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు.
విజన్.. ఇజం లేని పార్టీ కాంగ్రెస్
కరీంనగర్‌లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రగతి పథంలో భారతదేశం’ సదస్సులో బండి సంజయ్ మాట్లాడుతూ దేశ భవిష్యత్, భద్రత విషయంలో స్పష్టమైన విజన్ ఉన్న మహానేత మోదీ అని కొనియాడారు. విజన్‌తో పాటు ఇజం కూడా లేని పార్టీ కాంగ్రెస్సేనన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటే యాలని ప్రశ్నించారు. మోదీ పదేళ్ల పాలనలో ఇప్పుడు దేశం ఏ విధంగా ఉందో.. కాంగ్రెస్ పాలనలో దేశం పరిస్థితి ఎట్లుండేదో విశ్లేషించి ప్రజల ముందుంచాలని మేధావి వర్గానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment