సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఓ చారిత్రక తప్పిదమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్లు అప్పులు తెచ్చి పనికిరాని చెత్త ప్రాజెక్ట్‌ను కట్టించారని నిప్పులు చెరిగారు. ఈ ప్రాజెక్ట్‌పై గప్పాలు పలికిన కేసీఆర్ కుటుంబం.. ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. వీళ్ల అసమర్థతతో పిల్లర్లు కుంగిపోతే, ఎవరో కుట్ర చేశారంటూ కేసు నమోదు చేయడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.
కాళేశ్వరం విషయంలో ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అసలు ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టాలన్నారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుపై న్యాయ విచారణకు సిద్ధమా అని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. కేసీఆర్ సూపర్ ఇంజనీర్ అవతారం ఎత్తి.. ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదని గొప్పలు చెప్పుకున్నారని.... ఇదేనా మీ సూపర్ ప్రాజెక్టు నాణ్యత? అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలను మోసం చేయడానికే...
రైతులకు ఈ ప్రాజెక్ట్‌తో ఒరిగిన ప్రయోజనం శూన్యమని, ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రాజెక్టును ఉపయోగించారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుందని... అధికారులు సరిగ్గా వివరాలు ఇవ్వడం లేదన్నారు.
ప్రాజెక్ట్‌పై తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదని, కేసీఆర్ అతి తెలివే ఈ సమస్యకు కారణమని మండిపడ్డారు. కుట్ర జరిగిందనే పేరుతో వారి అసమర్థ నిర్ణయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలని డిమాండ్‌చేశారు. ఇప్పటికైనా చేసింది తప్పని తెలుసుకొని కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment