ఏపీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయడంలో బిజీగా.. | Ksr Comments On The Way Chandrababu Spoke In The Governor's Speech About The Brand Image Of AP State | Sakshi
Sakshi News home page

ఏపీ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయడంలో బిజీగా..

Published Wed, Jul 24 2024 11:40 AM | Last Updated on Wed, Jul 24 2024 12:24 PM

Ksr Comments On The Way Chandrababu Spoke In The Governor's Speech About The Brand Image Of AP State

ఏ ప్రభుత్వమైనా తన రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీల ప్రభుత్వం రాష్ట్ర పరువు తీస్తున్నాయి. బ్రాండ్ ఇమేజీని నాశనం చేసేలా వ్యవహరిస్తున్నాయి. శాసనసభ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంలో అధికారంలోకి కొత్తగా వచ్చిన తాము ఏమి చేయదలిచామో ప్రజలకు వివరిస్తారు. తాము ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చుతామో తెలియచెబుతారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ ప్రసంగంలో అంతా రివర్స్‌లో మాట్లాడించారు.

ఎంతసేపు గత వైఎస్సార్‌సీపీ పాలనో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో నాశనమైపోయిందన్నట్లుగా ప్రచారానికి తప్ప నిర్మాణాత్మక వైఖరిని చెప్పడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వెనుకంజ వేస్తున్నారు. రోజూ చంద్రబాబు చేసే విమర్శలు, ఆరోపణలనే గవర్నర్ నజీర్‌తో చదివించడానికే అయితే అసలు ఈ కార్యక్రమమే అవసరం లేదు. మొక్కుబడిగా నాలుగు రాజకీయ ఆరోపణలు చేయించి పంపిస్తే సరిపోయేది. మరో వైపు రాష్ట్రంలో ఏవైనా పనులు జరుగుతాయని ఆశలు పెట్టుకోవద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెప్పేశారు. అంటే ఏవేవో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాం కనుక, ఆ పవర్‌ను ఎంజాయి చేయండి తప్ప, కోరికలేవీ కోరవద్దని చెప్పినట్లుగా అర్థం అవుతుంది.

గవర్నర్ ప్రసంగాన్ని పరిశీలించండి.. గత ప్రభుత్వపాలనలో ఏపీకి జరిగిన నష్టం అంచనాలకు అందడం లేదని చంద్రబాబు చెప్పించారు. ఏపీ ఇమేజీని కోరుకునేవారు ఇలాగా ఎవరైనా ఉపన్యసిస్తారా!? గవర్నర్ పదవి కేవలం ఫిగర్ హెడ్ కనుక ఆయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ చిలకపలుకులే పలుకుతారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనను పొగిడిన గవర్నర్ నోటితోనే ఇప్పుడు తిట్టించారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులలో గెలిచిన ఎమ్మెల్యేలు సంతోషించే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలను తీర్చే మార్గం లేదు. దేశంలో మొదటిసారి ఈ పరిస్థితి చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో అర్ధవంతమైన చర్చల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని ఈ స్పీచ్‌లో తెలిపారు. దీనిని బట్టి ఏమి అర్థం అవుతుంది. సుదీర్గకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడుకు ఇప్పుడు పాలన చేతకావడం లేదనే కదా! ఎన్నికల ముందు ఎన్ని కోతలు కోశారు! చంద్రబాబు అనుభవంతో సంపద సృష్టిస్తారనే కదా! ఇప్పుడు ఇదేమిటి? ఇన్ని బీద ఏడుపులు అని ఎవరికైనా సందేహం రావచ్చు.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆ రోజుల్లో తన ప్రసంగాలలో ఎక్కడైనా టీడీపీపైనే ఆరోపణలు చేస్తూ కాలం గడిపిందా? కేవలం వంద కోట్ల నిల్వపెట్టి వెళ్లినా, ధైర్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపారే. తాను చేయదలచుకున్న కార్యక్రమాలు చేసి చూపించారే..! ఇప్పుడు ఎవరిది సమర్థ పాలన? వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిదా? చంద్రబాబుదా? ఏపీకి జరిగిన నష్టం అంచనాకు అందడం లేదని చంద్రబాబు చెబుతారు.. మరో వైపు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో జీఎస్డీపీ దేశంలోనే అగ్రభాగాన ఉన్నరాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో వరసగా మూడేళ్లు నెంబర్ ఒన్ పొజిషన్‌లో ఉంది కదా? మరి ఇందులో నాశనం ఏమి ఉంది. కేవలం ద్వేషంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేయడం తప్ప.

ఏ ప్రభుత్వంలో అయినా లోటుపాట్లు ఉంటాయి. అవి కొన్ని చెప్పడం వరకు ఓకే. అసలు గత ఐదేళ్లు అంతా సర్వనాశనమే అంటూ పచ్చి అబద్ధాలను చెప్పి ప్రజలను మోసగించేయత్నం తప్ప మరొకటి కాదు. పెట్టుబడిదారులలో ఏపీపై నమ్మకం కొరవడిందని గవర్నర్‌తో దారుణమైన అసత్యాన్ని చెప్పించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి టైమ్‌లో గ్రీన్ ఎనర్జీకి రంగంలో వచ్చిన మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడుల మాటేమిటి? వాటిని చెడగొట్టడానికి ఈనాడు మీడియా చేయని ప్రయత్నం లేదు కదా? బద్వేల్ వద్ద సెంచరీ ప్లాంట్ ఎలా నిర్మాణం జరిగింది? ఫార్మాహబ్‌ను సాధించింది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కాదా? విశాఖలో ఆదాని డేటా సెంటర్ ఎవరు తెచ్చారు? ఇలా అనేకం ఉన్నాయి. ఇంకా రావాలని కోరుకోవచ్చు.

కానీ ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా చంద్రబాబు వంటివారు ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష‍్టం తెస్తుంది. నిజానికి బ్రాండ్ ఇమేజీ నష్టపోతున్నది చంద్రబాబు టైమ్‌లోనే. నిత్యం రావణాకాష్టం మాదిరి ఏపీలో సాగుతున్న హత్యలు, విధ్వంసకాండతో ఏపీ బ్రాండ్ ఇమేజీ బాగా దెబ్బతింది. పుంగనూరు వద్ద వస్తున్న ఎలక్ట్రికల్ బస్‌ల కర్మాగారాన్ని భయపెడుతున్నది ఎవరు? పోర్టులు సైతం చంద్రబాబు టైమ్‌లో వచ్చాయిట. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి ఉందా? వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రామాయంపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల వద్ద చురుకుగా ఓడరేవుల నిర్మాణం చేపడితే వాటిని తనఖాతాలో వేసేసుకున్నారు. ఇక మిగిలిన అంశాలన్నీ చంద్రబాబు రోజువారీ మీడియాకు చెప్పే గోబెల్స్‌లో భాగమే తప్ప కొత్తవి లేవు.

సూపర్ సిక్స్ హామీలకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే వాటిని ఎలా అమలు చేసేది వివరించలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని గవర్నర్‌తో చెప్పించారు. అంటే దాని అర్థం హామీలు కొన్నింటిని మర్చిపోండని, లేదా ప్రజలే తమకు ఆ హామీలు వద్దు అని చెప్పాలన్నదే లక్ష్యం అని అర్థం అవుతూనే ఉంది. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమి మాట్లాడారు? ఇప్పుడు ఎలా మాట మార్చారో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. పాపం.. ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా, దైర్యంగా ముందుకు సాగేవాడు నాయకుడు అవుతారు. ఆ విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికు చంద్రబాబు సాటిరారనిపిస్తుంది. కనుక ఏపీ ఇమేజీని నాశనం చేస్తున్నది కూటమి నాయకత్వమే!


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement