సాక్షి, హైదరాబాద్: ఏ తప్పూ చేయని లగచర్ల రైతులను 40 రోజులుగా జైల్లో పెట్టింది ప్రజా ప్రభుత్వమా లేదా నియంత ప్రభుత్వమా అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. రైతన్నకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని, శాసనసభ కొనసాగినన్ని రోజులు ప్రభుత్వాన్ని వెంటాడతామని చెప్పారు. రైతులకు జరిగిన అన్యాయాలను సరిదిద్దే దాకా, వారిపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకునే వరకు, సీఎం రైతన్నలకు క్షమాపణ చెప్పేదాకా పోరాటం కొనసాగుతుందన్నారు. సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
థర్డ్ డిగ్రీతో వేధిస్తున్నారు
తమ భూములు ఇవ్వబోమన్న రైతులను జైల్లో పెట్టడమే కాకుండా థర్డ్ డిగ్రీతో వేధిస్తున్నారని, ఆ థర్డ్ డిగ్రీ వీడియో కాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు చూసి ఆనందిస్తున్నారని విమర్శించారు. ఫార్మా విలేజ్‌ను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం...పారిశ్రామిక కారిడార్ పేరిట భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. బయట ఉన్న గిరిజనులను, వారి కుటుంబాలను పోలీసులు ఇంకా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలను జైల్లో పెట్టిన రేవంత్‌రెడ్డి.. దీనిపై మాట్లాడకుండా పర్యాటక శాఖపై చర్చ పెట్టడమేంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైల్లో వేస్తున్నారని, తెలంగాణ, కొడంగల్ రేవంత్ రెడ్డి అయ్య జాగీరా అని నిలదీశారు. ఇప్పటివరకు రేవంత్‌రెడ్డి 30 సార్లు, మంత్రులు 70 సార్లు ఢిల్లీకి వెళ్లినా రూ.100 కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశి్నస్తే సభ నుంచి పారిపోయినా.. రేపు మరొక రూపంలో వస్తామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ అంశంపై శాసనసభలో చర్చ పెట్టడానికి దమ్ములేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ అని దుయ్యబట్టారు. అదానీతో జరుగుతున్న అవినీతిపై సభలోకి వచ్చి చర్చిద్దామంటే అడ్డుకున్నారని, లగచర్ల అంశంపై చర్చ పెడదామంటే సమాధానం చెప్పడం చేతగాక అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment