మీరు మోసం చేయని వర్గం ఉందా?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Fires on TDP Govt Chandrababu: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మీరు మోసం చేయని వర్గం ఉందా?: వైఎస్‌ జగన్‌

Published Fri, Nov 8 2024 5:05 AM | Last Updated on Fri, Nov 8 2024 1:08 PM

YS Jagan Fires on TDP Govt Chandrababu: Andhra pradesh

ఐదు నెలల్లో అన్ని వర్గాల ప్రజలను వంచించారు.. రాష్ట్రంలో ఇప్పుడున్న అన్యాయమైన పరిస్థితులను ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపాటు

రాష్ట్రంలో చీకటి రోజులు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు 

ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు పక్కకు వెళ్లిపోయాయి 

ప్రశ్నించే వారు ఉండకూడదని తప్పుడు కేసులు 

సూపర్‌ సిక్స్‌ లేదు.. సెవన్‌ లేదు 

విద్యా వ్యవస్థ నిర్వీర్యం..  రోడ్డున పడ్డ విద్యార్థులు  

ఆరోగ్యశ్రీ, 108, 104,     ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ దారుణం 

ఆర్బీకే వ్యవస్థను నిరీ్వర్యం..  లక్షన్నర పింఛన్లు కట్‌   

జన్మభూమి కమిటీల పెత్తనం మళ్లీ మొదలు..

రాష్ట్రం అంతటా టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలు, అరాచకాలు   

వారికి దన్నుగా నిలుస్తున్న ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఐదు నెలల్లో అన్ని వర్గాల ప్రజలను వంచించారు. సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవన్‌ లేదు. ఎక్కడ చూసినా పిల్లలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలే. ఈ ఘోరాలకు పాల్పడుతున్నదీ టీడీపీ కార్యకర్తలే. వాటిని నిలదీసిన సోషల్‌ మీడియా కార్యకర్తలను మాత్రం తప్పుడు కేసులతో అక్రమంగా నిర్బంధిస్తున్నారు.

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు మోసం చేయని వర్గమంటూ రాష్ట్రంలో ఏదైనా ఉందా అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం వంచించిందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న అన్యాయమైన పరిస్థితులను బహుశా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ  ఎక్కడా చూసి ఉండరని చెప్పారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాష్ట్రమంతా అతలాకుతలమవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. వైఎస్‌ జగన్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

మోసం చేయని వర్గం లేదు
ఎన్నికలప్పుడు వాళ్లు ఏం చెప్పారో.. ఏ హామీలిచ్చారో పక్కకు వెళ్లిపోయాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించే స్వరం ఉండకూడదనే ఆలోచనతో అణగదొక్కే చర్యలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌లు అన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైంది. సూపర్‌ సిక్స్‌లు లేవు.. సూపర్‌ సెవన్‌లు లేవు. ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. నీకు 15 వేలు, నీకు 15వేలు అంటూ పిల్లలను మోసం చేశారు.

నీకు 18 వేలు.. నీకు 18 వేలు అంటూ అక్కాచెల్లెమ్మలను మోసం చేశారు. నీకు 48 వేలు..48 వేలు అంటూ 50 ఏళ్లు నిండిన పెద్దమ్మలను మోసం చేశారు. నీకు 36 వేలు.. నీకు 36 వేలు అంటూ 20 ఏళ్లు నిండి ఉద్యోగం కోసం వెతికే యువతను మోసం చేశారు. నీకు 20వేలు.. నీకు 20 వేలు అంటూ రైతన్నలను మోసం చేశారు. ఐదు నెలలుగా ఈ ప్రభుత్వం వంచించని సెక్షన్‌ (వర్గం) అంటూ ఏదీ లేదు. ఐదు నెలలుగా పాలనలో అన్ని వ్యవస్థలను నీరుగార్చేశారు.

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం
పిల్లలు ఫీజు రీయింబర్సుమెంట్‌ అందక ఇబ్బందిపడుతున్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకు ఆ క్వార్టర్‌కు సంబంధించిన బిల్లులు ఇచ్చే వాళ్లం. జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్‌ ఏప్రిల్‌లో వెరిఫికేషన్‌ చేసి మేలో బిల్లులు ఇవ్వాలి. మే 13న ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి క్వార్టర్‌ ఎగ్గొట్టారు. మే జూన్, జూలై నెలలకు సంబంధించి ఆగస్టు నెలలో వెరిఫికేషన్‌ చేసి సెప్టెంబర్‌లో రెండో క్వార్టర్‌ ఇవ్వాలి. ఎగ్గొట్టారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌ నెలలకు సంబంధించి మూడో క్వార్టర్‌ ఇచ్చే పరిస్థితి లేదు. 

పిల్లలు ఈరోజు రోడ్డు ఎక్కుతున్నారు. ఫీజులు కట్టకపోతే చదువులు మానేయండంటూ యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌లోనూ ఫీజురీయింబర్సుమెంట్‌ కిందే కాకుండా ఏటా రూ.20 వేల చొప్పున ఇచ్చే వసతి దీవెనలో భాగంగా ప్రతి పిల్లాడికి ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ జమ చేసేవాళ్లం. అదీ పోయింది. విద్యా వ్యవస్థ రోడ్డున పడింది. వైద్యం పరిస్థితీ అంతే. ఆరోగ్యశ్రీకి బకాయిలు రూ.2,400 కోట్లకు చేరాయి. 104, 108 ఇవ్వాల్సిన బకాయిలు ఐదు నెలలుగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. పట్టించుకునే నాధుడే లేరు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ గాలికెగిరిపోయింది. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ మందులు అందుబాటులో ఉంటే.. ఈరోజు మందులు ఉన్నాయో లేదో కూడా పట్టించుకునే నాధులు లేరు. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత ఉండకూడదని మా ప్రభుత్వం తాపత్రయపడి జీరో వేకెన్సీ విధానం తెస్తే.. ఈరోజు సీహెచ్‌సీలు.. జిల్లా ఆస్పత్రుల వరకు స్పెషలిస్ట్‌ డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తిగా ఆపేశారు.

గతంలో ప్రతి పథకం డోర్‌ డెలివరీ జరిగితే.. ఇప్పుడా ఊసే లేకుండాపోయింది. పారదర్శకత ఊసే ఎగిరిపోయింది. మళ్లీ జన్మభూమి కమిటీలు, కార్యకర్తలు చెప్పే పరిస్థితిలోకి వెళ్లిపోయింది. దాదాపు లక్షన్నర పెన్షన్లు తీసేశారు. కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇంతవరకు జరగడంలేదు. నమోదు కార్యక్రమం కూడా జరగడంలేదు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యింది.

ప్రభుత్వ బడులు నాశనమయ్యాయి. ఇంగ్లిష్‌ మీడియం గాడి తప్పింది. టోఫెల్‌ క్లాసులు మూసేశారు. సీబీఎస్‌ఈ మూసేస్తున్నారు. ఐబీ దాకా ప్రయాణం అనుకున్నాం. అదీ లేదు. సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్ట్‌ ఆపేశారు. నాడు– నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్దలో పిల్లలకు రోజుకొక మెనూతో పెట్టాల్సిన భోజనం లేదు. అమ్మ ఒడి కూడా లేదు. – వైఎస్‌ జగన్‌

వ్యవసాయానికి సంబంధించి మా ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో ఆర్బీకేను పెట్టి ఒక అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ను నియమించి ప్రతి ఎకరాకు ఈ క్రాప్‌ చేసి ప్రతి రైతుకు ఉచిత పంటల బీమా ఇచ్చే కార్యక్రమం జరిగితే.. ఈరోజు ఈ – క్రాప్‌ లేదు.. ఆర్బీకేలు నిర్వీర్యం.. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. మళ్లీ మధ్యవర్తులు, దళారీల ద్వారా  కొనుగోలు కార్యక్రమం జరుగుతోంది. ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు.

91 మందిపై అత్యాచారాలు..  అందులో ఏడుగురిని చంపేశారు
శాంతి భద్రతలు (లా అండ్‌ ఆర్డర్‌) గురించి చెప్పాల్సి వస్తే.. (మీడియాను ఉద్దేశించి) నాకన్న చక్కగా మీరే బాగా చెబుతారు. ఈ ఐదు నెలల కాలంలో 91 మంది మహిళలు, పిల్లలపై అత్యాచారాలు జరిగాయి. అందులో ఏడుగురిని చంపేశారు. ఎలాంటి దారుణ ఘటనలు జరుగుతా ఉన్నాయంటే సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించి అరికట్టాల్సింది పోయి.. వారికి దన్నుగా నిలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేసాడు. నేరస్తుడు ఎవరంటే టీడీపీ నాయకుడే. రౌడీషీటర్‌. కేంద్ర మంత్రి పెమ్మ­సాని చంద్రశేఖర్‌ అనుంగు అను­చరుడు. చంద్రబాబు కండువా కప్పిన నాయకుడు.

⇒ బద్వేలులో జరిగిన ఘటన అత్యంత దారు­ణం. 16 ఏళ్ల బాలికపై అత్యా­చారం చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అటవీ ప్రాంతం నుంచి పరు­గులుతీస్తా ఉన్నా పట్టి­ంచుకున్న వాడు లేడు.

⇒  శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. చేసిన వారెవరంటే అధికార పార్టీ నాయకుల పిల్లలు. బర్త్‌డే వేడుకలని చెప్పి కూల్‌ డ్రింక్‌లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాటాలాడారు. 

⇒ హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తాకోడళ్లపై గ్యాంగ్‌ రేప్‌ చేశారు. నిందితులను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు మూడు రోజులు కాలయాపన చేశారు. హిందూపురం ఎమ్మెల్యే సాక్షాత్తు చంద్రబాబు బావమరిది. ఆ కుటుంబాన్ని వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించనూ లేదు.

⇒ అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలంలో కొప్పగుంటపాలెంలో 9వ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు. తనను వేధిస్తా ఉన్నాడని అంతకుముందు కేసు పెడితే అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకొచ్చి మళ్లీ బెదిరించడం మొదలు పెట్టాడు. దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే రెడ్‌బుక్‌ పాలనలో మునిగిపోయిన పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు. హోం మంత్రి పక్క నియోజకవర్గమే అయినా పరామర్శించేందుకు కూడా వెళ్లలేదు.

⇒ డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్తు టీడీపీకి చెందిన కౌన్సిలర్‌ భర్త ఓ దళిత మహిళను తీసుకుని పోయి డంప్‌యార్డులో రేప్‌ చేస్తే.. అక్కడ చెత్తకాగితాలు ఏరుకునే వారు ఆ దళిత అమ్మాయిని కాపాడారు.

⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎలమందలో జరిగిన ఘటన చూస్తే.. నిజంగా ప్రభుత్వం ఎలా పనిచేస్తా ఉందంటే.. 10వ తరగతి చదువుకున్న పాపను మాస్క్‌లు వేసుకొని వచ్చి కిడ్నాప్‌ చేసి బైకుపై తీసుకొనిపోయి బలవంతంగా ఆ పాపను కొట్టి తాగిపించి అత్యాచారం చేశారు. వాళ్ల నాయన ఇంత దారుణమైన ఘటన జరిగిందని మీడియాకు వచ్చి చెబితే తప్ప పోలీసులు స్పందించని పరిస్థితి ఉంది.

వాళ్ల నాయన మీడియాకు చెప్పిన తర్వాత, వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడకు వెళ్లిన తర్వాత, ఇష్యూ పెద్దది అయిన తర్వాత పోలీసులు ఏం చేయాలి? కనీసం జరిగిన ఘటనలో ఆ పాపకు, ఆ పాప నాన్నకు తప్పయిందని క్షమాపణ చెబుతూ బాధితురాలికి తోడుగా ఉండాలి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. కానీ చేసింది ఏమిటి? కవరప్‌ చేసేందుకు ప్రయత్నించారు. 10వ తరగతి చదువుతున్న పాప రోడ్డు మీద పోతా ఉంటే మాస్క్‌లు వేసుకొని రావడమేమిటి.., అత్యాచారం చేయడమే­మిటి? పోలీసులు ఏం చేస్తా ఉన్నారు?

⇒ డిప్యూటీ సీఎం పార్టీకి చెందిన కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు కాకినాడ రూరల్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను పక్కలోకి వస్తావా అన్న స్టేట్‌మెంట్‌ వైరల్‌ అయ్యింది. వీటిని ప్రశ్నించిన సోషల్‌ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధించి వేధిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement