వేలానికి అధ్యక్షా!
అధికారంలోకి వచ్చిందే తడవుగా అధికార కూటమి నేతలు ఇసుక, మట్టి, రేషన్ బియ్యం..ఇలా అన్నింటిలోనూ అక్రమాలకు తెరతీశారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేసి జేబులు నింపుకొన్నారు. తాజాగా
అన్నదాతకు చేదోడుగా ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి
సంఘాలపై నేతలు కన్నేశారు. ఈ సంఘాలను అడ్డంపెట్టుకుని
దండుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ పదవులను అమ్మకానికి పెట్టారు. ప్రధానంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో
ప్రాంతాన్ని బట్టి ధర నిర్ణయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యర్రగొండపాలెం:
జిల్లా వ్యాప్తంగా 90 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. అందులో సుమారు 24 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019 వరకూ అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు సొసైటీలను లూఠీ చేశారు. వాటిని గాడిలో పెట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి వీటికి నిధులు కేటాయించి ముందుకు నడిపించారు. వీటిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు, జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయించారు. వైఎస్సార్‌సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఆ సమయంలో ముందుగా అధ్యక్షుడితోపాటు ఇద్దరు సభ్యులు ఉండేలా సొసైటీల బాధ్యత అప్పచెప్పారు. నష్టాల్లో ఉన్న వాటిని గట్టెక్కించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సొసైటీ పాలక వర్గం సభ్యులతో రాజీనామాలు చేయించింది. అధికారులను ఇన్‌చార్జులుగా నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ప్రచారం. అందులో భాగంగానే అధికార కూటమి నేతలు వీటిపై కన్నేశారు. ఎలాగైనా పదవులు చేజిక్కించుకోవాలని తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు.
యర్రగొండపాలెంలో వేలం పాటలు?
యర్రగొండపాలెం నియోజకవర్గంలో వ్యవసాయ పరపతి సంఘాల్లో అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు అధికార టీడీపీ నేతలు యత్నాలు మొదలు పెట్టారు. నియోజకవర్గంలో మొత్తం 11 పరపతి సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘానికి సుమారు 3 వేల మంది సభ్యులు ఉంటారు. మొత్తంగా 33 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాలకు అధ్యక్ష పదవే కీలకం. సొసైటీలపై పెత్తనం చెలాయించి రైతులకు రుణాలిప్పించే ప్రక్రియలో కమీషన్ల పేరుతో దండుకోవచ్చని, సొసైటీ పరిస్థితి ఆధారంగా పదవులు బేరానికి పెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీల్లో ఎలాగైనా తమ పరపతి పెంచుకునేందుకు టీడీపీ నాయకులు కొందరు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడంలేదని తెలుస్తోంది. అధిక పోటీ ఉన్న చోట వేలంపాటలు సైతం నిర్వహించేందుకు నేతలు రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రంలోని పీఏసీఎస్‌పై కన్నేసిన అటూ.. ఇటూ పార్టీ ఫిరాయించే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు తమ సామాజిక వర్గానికి ఆ పదవీ కేటాయించి తనకు అధ్యక్షుడిగా ప్రతిపాదించినట్లయితే రూ.35 లక్షలు ఇచ్చేలా నియోజకవర్గ స్థాయి కూటమి నాయకుడి వద్ద ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గానికి కేటాయించి తనను అధ్యక్షుడిగా చేసినట్లయితే రూ.25 లక్షలు ముట్టచెప్తానని మరొకరు బేరాలు సాగుతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యర్రగొండపాలెంలోని సొసైటీ అధ్యక్ష పదవి ఎస్టీ, బీసీలకు కేటాయించినట్లయితే తమ అందరికీ ఆనందమేనని, కానీ పదవిని డబ్బులతో కొనే వారికి అందలం ఎక్కిస్తే తమ పరిస్థితి ఏమిటని కూటమి వర్గానికి చెందిన రైతులు గుస గుసలాడుకుంటున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సహకార పరపతి సంఘాల్లో అక్రమార్కులకు చోటు దక్కనివ్వకుండా చూడటానికి సిద్ధం అవుతున్నారు.
సొసైటీలపై పచ్చ గద్దలు
ప్రాథమిక పరపతి సంఘాల పదవులు వేలం.. ప్రాంతాన్ని బట్టి రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు పలకనున్న పాట పరపతి అధ్యక్ష పదవులపై కన్నేసిన టీడీపీ నేతలు యర్రగొండపాలెం నియోజకవర్గంలో తీరవెనుక భాగోతం
Comments
Please login to add a commentAdd a comment