యాసంగికి మిడ్‌మా‘నీరు’
● ప్రారంభమైన నీటి విడుదల ● మార్చి 31 వరకు కొనసాగింపు ● 53వేల ఎకరాల ఆయకట్టు ● ప్రాజెక్టులో 26 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మిడ్‌మానేరు కుడికాల్వ ద్వారా 56వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. ఈనెల 25 నుంచి 2025 మార్చి 31 వరకు నీటి విడుదల చేస్తామని మిడ్‌మానేరు ఈఈ జగన్ తెలిపారు. గేట్ల ద్వారా ఎల్‌ఎండీ ఆయకట్టుకు, ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా మిడ్‌మానేరు ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 26.02 టీఎంసీల నీరు ఉంది.
53వేల ఎకరాలకు..
బోయినపల్లి మండలంలోని మిడ్‌మానేరు ప్రాజెక్టులో 26 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండడంతో ప్రభుత్వ ఆదేశాలతో పంటలకు సాగునీరు అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కుడికాల్వ ద్వారా రోజుకు 250 క్యూసెక్కులు విడుదల చేయడం ద్వారా 53,424 ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందనుంది. కుడికాల్వ కింద ఇల్లంతకుంట, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, చిగురుమామిడి, సైదాపూర్, కోహెడ మండలాల్లోని ఆయకట్టు భూములకు నీరందనుంది. ఎడమకాల్వ కింద బోయినపల్లి, కొత్తపెల్లి మండలాల్లోని 5వేల ఎకరాల్లోని పంటలకు సాగు నీరందాలి. అయితే ఎడమకాల్వ కింద డిస్ట్రిబ్యూటరీ కాల్వలు సరిగ్గాలేవు.
శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు
మిడ్‌మానేరు ప్రాజెక్టు
ప్రాజెక్టు సామర్థ్యం : 27.50 టీఎంసీలు
ఆయకట్టు : 53,424 ఎకరాలు
కుడికాల్వ కింద మండలాలు :
ఇల్లంతకుంట, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, చిగురుమామిడి,
సైదాపూర్, కోహెడ
నీటి విడుదల : 250 క్యూసెక్కులు
ఎల్‌ఎండీకి విడుదల : 500 క్యూసెక్కులు
మిడ్‌మానేరు నుంచి సాగునీరు
మిడ్‌మానేరులో 26 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. యాసంగి పంటలకు ఈనెల 25 నుంచి నీటి విడుదల ప్రారంభించాం. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నీటి విడుదల కొనసాగుతోంది. యాసంగిలో ప్రాజెక్టు నీటితో కుడికాల్వ కింద ఏడు మండలాల రైతులకు చెందిన 53వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.
– జగన్, మిడ్‌మానేరు, ఈఈ
ఎల్‌ఎండీ ఆయకట్టుకు సాయంగా సాగునీరు
కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం మిడ్‌మానేరు ఒక గేటు ద్వారా ఎల్‌ఎండీకి 500 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment