రాజన్నసిరిసిల్ల జిల్లాకు 6886 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణానికి రూ.189.81 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 3,653 ఇళ్లు పూర్తికాగా 3,357 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగతా 2,607 ఇళ్ల పనులే ప్రారంభంకాలేదు. జిల్లా వ్యాప్తంగా చందుర్తి, రుద్రంగి, వేములవాడరూరల్, ఇల్లంతకుంట మండలాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో వెనకబడి ఉన్నాయి. వేములవాడఅర్బన్, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి మండలాల్లో ఒక్క ఇల్లు కూడా పూర్తికాలేదు.
లబ్ధిదారుల్లో గుబులు
స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పలువురు లబ్ధిదారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పొందిన వారందరూ నిరుపేదలే కావడం, స్థానికంగా అందరికీ పనులు లభించకపోవడంతో కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అధికారులు వాసప్ తీసుకుంటామని నిర్ణయించడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సొంతిల్లు ఉందనే భరోసాతో ఇతర ప్రాంతాల్లో బతుకుతున్న వారికి అధికారుల నిర్ణయం గుదిబండగా మారింది. వచ్చిన ఇల్లు పోతే తమకు సొంతూరిలో కనీసం నిల్వ నీడ కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment