మండలానికో చేపల మార్కెట్
● మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రం
సిరిసిల్ల: మండలానికో చేపల మార్కెట్ నిర్మించాలని, మత్స్యకార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సంఘం ప్రథమ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. చంద్రంపేట రైతువేదికలో శనివారం జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం అధ్యక్షతన జరిగింది. రామచంద్రం మాట్లాడుతూ సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న 50 ఏళ్లు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ అందించాలని కోరారు. చేపల పెంపకంపై రైతులకు ఆక్వా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించాలని, ఐదేళ్ల కాలపరిమితి ముగిసిన సంఘాలకు రెన్యూవల్ చేయాలని కోరారు. గుర్తింపుకార్డులు, లైఫ్‌జాకెట్లు అందించాలని కోరారు. సిరిసిల్లలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం భవనానికి ప్రభుత్వం రెండు ఎకరాలు కేటాయించి, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. చెరువులలోని చేపలకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా మత్స్యశాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.సౌజన్య ఆదాయ, వ్యయాలు వెల్లడించారు. డైరెక్టర్లు అంబటి శేఖర్, ఫణి శివరామకృష్ణ, నిమ్మల బాబు, జెట్టి దేవయ్య, పిట్టల బాబు, కూనబోయిన పర్శరాములు, గాడిచెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment