సమస్యలపై సమ్మెపోరు
● 20 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగులు ● కేజీబీవీల్లో కుంటుపడుతున్న బోధన ● నష్టపోతున్న విద్యార్థులు
సిరిసిల్లఎడ్యుకేషన్: సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఇరువై రోజులుగా కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో బోధన నిలిచిపోయింది. జిల్లాలోని 13 కేజీబీవీల్లో పనిచేస్తున్న 424 మంది సమ్మెలో ఉండడంతో బోధన నిలిచి, భోజనం సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సార్లు సమ్మెబాట పట్టడంతో విద్యార్థులు సైతం శనివారం నుంచి ఇంటిబాట పట్టారు. తమ తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నారు. ఫలితంగా కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులు విద్యలో వెనుకబడే ప్రమాదం ఏర్పడింది.
ఆందోళనలో ‘పది’ విద్యార్థులు
కేజీబీవీల్లోని 508 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరంతా మార్చి నెలలో వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటి నుంచి ఉదయం, సాయంత్రం స్పెషల్ క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తేనే పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేజీబీవీల్లోని బోధన సిబ్బంది మొత్తం సమ్మెలో ఉండడంతో విలువైన సమయాన్ని పదో తరగతి విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ ప్రభావం వారి పరీక్ష ఫలితాలపై చూపుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి
జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసే రెగ్యులర్ ఉపాధ్యాయులను కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని డీఈవోలకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. పక్క జిల్లా జగి త్యాలలో సర్దుబాటుకు ఆదేశాలు రాగా, సిరిసిల్లలో కసరత్తు జరుగుతున్నట్లు డీఈవో జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. జిల్లాలో విద్యార్థులు లేని స్కూళ్లలో ఉన్న ఉపాధ్యాయులను కేజీబీవీల్లో సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రతీ కేజీబీవీకి స్పెషలాఫీసర్‌ను నియమించేందుకు రెగ్యులర్ ఉపాధ్యాయినుల పేర్లు ఎంఈవోలు తెలిపినట్లు సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ పద్మజ వెల్లడించారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులు వీరు..
జిల్లా స్థాయి : ఏపీవోలు, సిస్టం అనలిస్టులు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎంఎల్టీలు, మెసెంజర్స్
మండల స్థాయి : ఎంఐఎస్ కో–ఆర్టినేటర్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐఈఆర్సీలు, మెసెంజర్స్
స్కూల్ కాంప్లెక్స్ స్థాయి : క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్
పాఠశాల స్థాయి : పార్ట్ టైం ఇన్స్‌స్ట్రక్టర్స్, కేజీబీవీలు
యూఆర్‌ఎస్ : స్పెషల్ ఆఫీసర్స్, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, క్రాఫ్డ్ కంప్యూటర్ ఇన్స్‌స్ట్రక్టర్స్, అటెండర్స్, వంట సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు
ఉద్యోగుల డిమాండ్స్ ఇవీ..
● సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి.
● ఉద్యోగ భద్రతో కూడిన పే స్కేల్ ఇవ్వాలి.
● ఉద్యోగ విరమణ పొందుతున్న వారికి, ఇప్పటికే విరమణ పొందిన వారికి బెనిఫిట్స్ కింద రూ.25 లక్షలు అందించాలి.
● ప్రభుత్వ, విద్యాశాఖ నియామకాల్లో మార్కుల వెయిటేజీ కల్పించాలి.
● ప్రతీ ఏటా ఉద్యోగులను రీ ఎంగేజ్ విధానం తొలగించాలి.
● ప్రతీ ఉద్యోగికి రూ.10లక్షల బీమా, రూ.10లక్షల ఆరోగ్య బీమా అందించాలి.
కేజీబీవీల సమాచారం
కేజీబీవీలు : 13
టీచింగ్ స్టాఫ్ : 147
మొత్తం ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు : 424
విఽభాగాలు : 27
మొత్తం విద్యార్థులు : 3,265
టెన్త్ విద్యార్థులు : 508
ఇంటర్‌విద్యార్థులు : 634
సర్దుబాటు ఉత్తర్వులు రాలేదు
జిల్లాలో వివిధ విభాగాల్లో సమగ్ర శిక్షా తరఫున ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కేజీబీవీల్లో బోధనకు ఆటంకం కలుగుతుంది. దీన్ని అధిగమించేందుకు రెగ్యులర్ ఉపాధ్యాయుల్లో కొందరినీ ఇవ్వాలని ప్రభుత్వ యోచన ఉంది. కానీ అధికారిక ఆదేశాలు రాలేదు. వస్తే ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. విద్యార్థులకు నష్టం కలుగకుండా చూస్తాం.
– జగన్‌మోహన్‌రెడ్డి, డీఈవో
ఉద్యోగ భద్రత కోరడం తప్పా?
పనిచేస్తున్న చోట ఉద్యోగ భద్రత కోరుతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ భద్రత, రెగ్యులరైజ్ చేయాలి. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం కాబట్టే సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ ఉపాధ్యాయులు సర్దుబాటు పేరిట మాకు అన్యాయం చేయొద్దు.
– దేవేందర్, సీఆర్పీ, సిరిసిల్ల
Comments
Please login to add a commentAdd a comment