అత్యంత ప్రమాదకరమైన మలుపులు
సిరిసిల్ల: జిల్లాలోని ప్రధాన రహదారులు మూలమలుపుతో ప్రమాదకరంగా ఉన్నాయి. సిరిసిల్లను కలిపే సిద్దిపేట ప్రధాన రహదారి 36 కిలోమీటర్లు ఉండగా.. 12 చోట్ల అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. తంగళ్లపల్లి మండల కేంద్రంలోనే రెండు చోట్ల ప్రమాదకరమైన మూలమలుపులు ఉండగా.. సారంపల్లి–నేరెళ్ల మధ్య మూడుచోట్ల, నేరెళ్ల ఊరిలో రెండు చోట్లు, జిల్లెల్ల శివారులో ఒక్క చోట అత్యంత ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ మలుపు వద్ద ఎన్నో ప్రమాదాలు జరగ్గా.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
సిరిసిల్ల–కామారెడ్డి రహదారిలో వెంకటాపూర్, రాగట్లపల్లె, రాచర్ల గొల్లపల్లి, గజసింగారం, గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతాల్లో ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. సిరిసిల్ల–మరిమడ్ల దారిలో కోనరావుపేట మండల పరిధిలో అనేక మలుపులు ఉన్నాయి. కొలనూర్, మర్తనపేట, ధర్మారం, మల్కపేట, నిజామాబాద్, వెంకట్రావుపేట, కొండాపూర్, నిమ్మపల్లి, మరిమడ్ల వరకు అన్ని గ్రామాల శివారుల్లోనూ డేంజర్ మలుపులు ఉన్నాయి.
వేములవాడ–కోరుట్ల దారిలోనూ మూడపల్లి, మరిగడ్డ, మల్యాల, రుద్రంగి శివారుల్లో ప్రమాదకరమైన మలుపులు ప్రమాద హేతువులుగా ఉన్నాయి. వేములవాడ–జగిత్యాల రోడ్డులోనూ శాత్రాజుపల్లి, పాజుల్‌నగర్, వట్టెంల వద్ద ప్రమాదకరమైన మలుపులున్నాయి. బోయినపల్లి, ఇల్లంతకుంట మండల కేంద్రాలు, గంభీరావుపేట–నర్మాల, ముస్తాబాద్–సిద్దిపేట మార్గాల్లోనూ రోడ్ల పరిస్థితి ఇదే..
ప్రాణాలు హరీ
ప్రాణం ఖరీదు అమూల్యం. అలాంటి ప్రాణాలు రోడ్డు ప్రమాదాల రూపంలో హరీమంటున్నాయి. జిల్లాలోని బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద గురువారం ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో పోలవేని మంగ(50) అనే మహిళ అక్కడికక్కడే మరణించగా... అయ్యప్ప మాలధారులైన పోలవేని గట్టుబాబు(60), మాడిశెట్టి అశోక్(60), అహల్య(58)లు తీవ్రగాయాలతో చావుబతుకుల్లో ఉన్నారు. తాజాగా వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజుపల్లి వద్ద శుక్రవారం సైకిల్‌పై వెళ్తున్న స్వాత్రిక్ అనే 12 ఏళ్ల బాలుడిని లారీ ఢీ కొట్టడంతో మరణించాడు. ఇలా జిల్లాలో అనేక రోడ్డు ప్రమాద ఘటనల్లో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాలు.. మరణాలు
గత మూడేళ్లలో జిల్లాలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2022లో 174 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 82 మంది మృత్యువాత పడ్డారు. 2023లో 218 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 74 మంది మరణించాడు. ఈ ఏడాది 2024లో డిసెంబరు 27వ తేదీ నాటికి 294 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 89 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా రోడ్డు మూలమలుపు మూలంగా జరిగినవే కావడం దారుణం. ఆర్ అండ్ బీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి మూలమలుపుల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అతివేగం..అజాగ్రత్త
రోడ్డు ప్రమాదాలకు కారణం అతివేగం, అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. వీటి కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ప్రతి నెలా కొత్తగా 500 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వాటికి తగినట్లుగా రోడ్లు లేవు. దీంతో వాహనాల రద్దీ పెరుగుతుంది. ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలి. వేగం తగ్గితే ప్రాణాలు నిలుస్తాయి.
– వేముల మార్కండేయులు,
సామాజిక కార్యకర్త జాగ్రత్తలు తీసుకుంటున్నాం
జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాం. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాల నివారణకు ప్రధాన చౌరస్తాల్లో త్రీడీ యానిమేడేడ్ పెట్రో కార్ ఏర్పాటు చేస్తున్నాం. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు సైన్ బోర్డులు, రబ్బర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశాం. అప్రోచ్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశాం. రోడ్డు భద్రతలో భాగంగా విద్యార్థీని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
– అఖిల్ మహాజన్, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment