తెగ తాగేశారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
ఉమ్మడి జిల్లాలో నయా‘సాల్’ జోష్.. ఫుల్లుగా కనిపించింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం డిసెంబరు 31న పాత జిల్లాలో రూ.కోట్లాది కొనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా లిక్కర్, కేకులు, బిర్యానీలు ఈ కొనుగోళ్లలో అగ్రభాగాన నిలిచాయి. అందులోనూ లిక్కర్ విక్రయాలు సింహభాగం దక్కించుకున్నాయి. కరీంనగర్ జిల్లా రూ.30 కోట్ల విక్రయాలతో ఉమ్మడి జిల్లాలో టాప్‌లో నిలిచింది. జగి త్యాల జిల్లాలో మంగళవారం ఒక్కరోజు రూ.4.42 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. సిరిసిల్ల జిల్లాలో రూ.4.36 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. కరీంనగర్‌లో గత డిసెంబర్‌లో రూ.133.78 కోట్ల బిజినెస్ జరగగా.. ఈ ఏడాది రూ.126.30 కోట్లకు పరిమితమైంది. జగిత్యాలలో గతేడాది రూ.81.10 కోట్ల విక్రయాలు జరగగా.. ఈ ఏడాది రూ.73 కోట్ల వద్ద నిలిచిపోయింది.
బేకరీలు, రెస్టారెంట్లు కళకళ
కొత్త సంవత్సరం అనగానే అందరికీ ముందుగా కేకులే గుర్తొస్తాయి. యువత, చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా కేకులు కోసి పండగ చేసుకుంటారు. ఇలా ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బేకరీలన్నీ కేకుల విక్రయాలతో కిటకిటలాడాయి. అన్ని ముఖ్యకూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఆఫర్లతో హాట్, కూల్ కేకులన్నీ అమ్ముడుపోయాయి.
సెకన్‌కు 2 కేకులు, 6 బిర్యానీలు
కరీంనగర్ జిల్లా కేకులు, బిర్యానీల విషయంలో పాత జిల్లాలోనే టాప్‌లో నిలిచింది. మొత్తంగా 2 లక్షలకుపైగా కేకులతో 24 గంటల్లో సెకనుకు 2 కేకుల చొప్పున అమ్ముడయ్యాయి. ఈ బిజినెస్ రూ.6కోట్ల వరకు ఉంటుంది. బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా 5.50 లక్షల బిర్యానీలు అమ్ముడుపోయి రూ.11 కోట్ల బిజినెస్ అయ్యింది. ఈ లెక్కన సెకనుకు 6 బిర్యానీల విక్రయాల జరిగి సరికొత్త రికార్డు నెలకొల్పాయని వ్యాపారులు తెలిపారు. నేరుగా కొనేవారితోపాటు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటళ్లు కళకళలాడాయి. కర్రీతో పని ఉండదు. ఎక్కడైనా తినే వీలుండటంతో యువతతోపాటు అన్ని వర్గాలవారు బిర్యానీ తినేందుకు మొగ్గు చూపారు. పైగా ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో లోకేషన్ పెట్టిన చోటకు వచ్చి మరీ డెలివరీ చేసే సదుపాయం రావడంతో ఎక్కువ మంది బిర్యానీ తినేందుకు ఇష్టపడ్డారు.
జోరుగా సాగిన మద్యం, కేక్‌లు, బిర్యానీ అమ్మకాలు
కరీంనగర్‌లో ఒక్కరోజులోనే రూ.30 కోట్ల లిక్కర్ విక్రయాలు
రూ.7 కోట్ల కేకులు, రూ.11 కోట్ల బిర్యానీ సేల్స్
ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ టాప్
జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లిలోనూ ఇదే తీరు
ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు ఇలా
జిల్లా మద్యం అమ్మకాలు
కరీంనగర్ రూ.30 కోట్లు
జగిత్యాల రూ.4.42 కోట్లు
సిరిసిల్ల రూ.4.36 కోట్లు
పెద్దపల్లి రూ.3.50 కోట్లు
కేక్‌లు
జిల్లా కేకులు బిజినెస్
కరీంనగర్ రెండు లక్షలు రూ.6కోట్లు
జగిత్యాల 15వేలు రూ.30లక్షలు
పెద్దపల్లి 30వేలు రూ.60లక్షలు
సిరిసిల్ల 20వేలు రూ.40లక్షలు
బిర్యానీలు
జిల్లా బిర్యానీ బిజినెస్ (సుమారు)
కరీంనగర్ 5.50లక్షలు రూ.11కోట్లు
జగిత్యాల 8000 రూ.24లక్షలు
పెద్దపల్లి 12,500 రూ.31.25లక్షలు
సిరిసిల్ల 10వేలు రూ.25లక్షలు
(గమనిక: ఇందులో కేవలం ప్రముఖ హోటళ్ల నుంచి సరాసరి వివరాలు మాత్రమే. సంఖ్యల్లో మార్పు ఉండొచ్చు.)
Comments
Please login to add a commentAdd a comment