పోరాట కెరటం.. అమృత్‌లాల్ శుక్లా
● నిజాంను ఎదిరించిన యోధుడు ● నేడు 34వ వర్ధంతి
సిరిసిల్ల: దేశం యావత్తు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వేళ.. సిరిసిల్ల గడ్డపై రజాకార్ల ముఠాలను ఎదిరించేందుకు నూనూగు మీసాల యువకుడు పిడికిలెత్తాడు. ఉద్యమకారుడిగా పీడిత ప్రజలకు మార్గదర్శిగా నిలిచాడు. ప్రజల కష్టాలను తొలగించేందుకు ప్రజాప్రతినిధిగా గెలిచాడు. ప్రజాపోరాటంలో పాల్గొన్న అమృత్‌లాల్ శుక్లా 1908లో జన్మించారు. 83 ఏళ్ల వయసులో 1991 జనవరి 14న అస్తమించారు. నేడు ఆయన 34వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
ఆంధ్ర మహాసభతో కీలక మలుపు
తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్‌లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పీవీ నర్సింహారావు, బద్దం ఎల్లారెడ్డి, కేవీ రంగారెడ్డి వంటి వారితో జిల్లాకు చెందిన బద్దం ఎల్లారెడ్డి, అమృత్‌లాల్ శుక్లా, చెన్నమనేని రాజేశ్వర్‌రావు, గడ్డం తిరుపతిరెడ్డి, కర్రెల్లి నర్సయ్య పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌పై దాడి..
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే నేరమైన ఆ రోజుల్లో రజాకార్లపై తిరుగుబాటు చేశారు. పల్లెల్లో రైతుకూలీలను సంఘటితం చేసి నిజాం వ్యతిరేఖ ఉద్యమంలో భాగస్యామి అయ్యారు. అమృత్‌లాల్ శుక్లా 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడిచేశాడు. గడీలను లూటీ చేసి, ఆ సంపదను పేదలకు పంచిపెట్టారు. అమృత్‌లాల్‌శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా... చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లు గప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తప్పించుకున్నాడు. నిజాంకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో మళ్లీ భాగస్వామి అయ్యారు. అజ్ఞాతంలో ఉంటూ పోరాడారు. హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యే వరకు పోరుబాటలోనే ఉన్నారు.
సిరిసిల్ల రెండో ఎమ్మెల్యేగా...
1957లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అమృత్‌లాల్ శుక్లా ఎన్నికయ్యారు. అప్పట్లో కమ్యూనిస్ట్‌లపై నిషేధం ఉండడంతో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి ఏవీఆర్ రెడ్డిపై విజయం సాధించారు. 1991 జనవరి 14న అస్తమించారు. అమృత్‌లాల్ శుక్లా పోరాటాన్ని ఆయన సమకాలికులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. అమృత్‌లాల్ శుక్లా వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్ట్ నాయకులు సిరిసిల్ల మానేరువాగులోని స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment