గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులపై సమీక్ష
సిరిసిల్ల: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్టమైన కార్యాచరణను అమలుచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయానల్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా అధికారులతో రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్‌కార్డుల జారీ అంశాలపై సమీక్షించారు. ఈనెల 26 నుంచి కొత్తగా నాలుగు ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి పాటించాల్సిన విధానాలపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలోని అంశాలు, గైడ్‌లైన్స్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రైతుభరోసాకు సంబంధించి అధికారులు వ్యవసాయ యోగ్యమైన భూమో.. కాదా.. అని మాత్రమే పరిశీలించాలని సూచించారు. భూభారతి(ధరణి) నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతుభరోసా జాబితా నుంచి తొలగించాలని తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూమిలో పంట వేసినా, వేయకపోయినా రైతుభరోసా అందుతుందనే విషయాన్ని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దార్, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షణలో పట్టాదార్ పాస్‌పుస్తకాల డేటా, గూగల్‌మ్యాప్, రెవెన్యూ మ్యాప్‌ల వారీగా పరిశీలించాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసిన భూములను చెరువులు, కుంటలలో ఉన్న భూములను డీ–మార్కింగ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
నాలా భూములను గుర్తించాలి
జిల్లా పంచాయతీ అధికారి, పరిశ్రమల అధికారి, ఎంపీడీవోలు, ఎంపీవీవోలు, పంచాయతీ కార్యదర్శులు సర్వేనంబర్ల వారీగా ఆబాదీ భూములను డీ–మార్కింగ్ చేయాలని, పట్టణాలకు స మీపంలో పరిశ్రమల భూములు, నాలా కన్వర్షన్, లేఔట్, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలన్నారు.
భూమి లేని పేదలకు..
భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి రూ.12వేలు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023–24 సంవత్సరానికి 20 రోజులు పనిచేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలి పారు. గ్రామసభలో ఎంపిక చేసిన జాబితాపై అభ్యంతరాలు వస్తే ఎంపీడీవో 10 రోజుల్లో పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అర్హులకు రేషన్‌కార్డులు
సామాజిక ఆర్థిక సర్వే కింద జిల్లాలో 9 వేల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డు లేదని తేలిందని, మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్‌లు రేషన్‌కార్డుల జారీ పర్యవేక్షించాలన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేషన్‌కార్డుల ప్రోసిడింగ్స్ పంపిణీ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను సైతం అత్యంత పేదలకు మొదటి జాబితాలో చోటు కల్పించాలన్నారు. ఈనెల 16 నుంచి 20 వరకు పరిశీలించి, 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి అర్హుల జాబితా ప్రదర్శించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్‌డీవో శేషాద్రి, జిల్లా వ్యవసాయాధికారి అబ్జల్‌బేగం, బీసీ సంక్షేమ అధికారి రాజమోహన్, మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు తహసీల్దార్లు, వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment