మత్తులో జోగుతున్న యువత, విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

మత్తులో జోగుతున్న యువత, విద్యార్థులు

Published Thu, Jan 16 2025 7:24 AM | Last Updated on Thu, Jan 16 2025 5:29 PM

-

నిర్మానుష్య ప్రాంతాలే అడ్డా

ఆందోళనలో తల్లిదండ్రులు

పట్టించుకోని అధికారులు

గాంజా, డ్రగ్స్‌తో దుష్పరిణామాలపై సినీ స్టార్లు, ఎంతో మంది ప్రముఖులతో ప్రభుత్వం ప్రకటనలు చేయిస్తోంది. ఎవరూ మత్తుకు బానిస కావద్దని, అలాంటి వారిని రిహాబిలిటేషన్‌ సెంటర్లో చేర్పించి, మార్పునకు ప్రయత్నిస్తోంది. కానీ మత్తుకు బానిసైన వారి బాధిత కుటుంబాలు తమ పరువు పోతుందనే కారణంతో ఇందుకోసం ముందుకురావడం లేదు.

బడంగ్‌పేట్‌: కొంతమంది యువత, విద్యార్థులు గంజాయి మత్తులో ఊగి, తూగుతున్నారు. పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తూ చిన్న విషయాలకే అల్లర్లకు పాల్పడుతున్నారు. దీంతో బాలాపూర్‌ మండలం, బడంగ్‌పేట కార్పొరేషన్‌ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గంజాయి అమ్మకం, రవాణాను కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అడ్డాలు అనేకం..
బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని సీకేఆర్‌ కేటీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వెనకాల, రాఘవేంద్ర కాలనీ, మౌంట్‌ కార్మెల్‌ స్కూల్‌ సమీపంలోని నూతనంగా వెలిసిన వెంచర్లల్లో, 119 సర్వేనంబర్‌, భీష్మనగర్‌ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతం, సాయిబాలాజీనగర్‌, మునిసిపల్‌ కాలనీల మధ్య ఉన్న ఓపెన్‌ స్థలాలు, బాలాపూర్‌, ఎంవీఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వెనకాల ఉన్న వెంచర్‌, దీని పరిసర ప్రాంతాల్లో, స్ఫూర్తి ఇంజనీరింగ్‌ కాలేజీ, అల్మాస్‌గూడ, జేఎన్‌ఎంయూఆర్‌ఎం నివాస గృహాల వద్ద, నాదర్‌గుల్‌లోని మర్రి లక్ష్మమ్మ వెంచర్‌ పరిసరాల్లో.. ఇలా చెప్పుకుంటూ పోతే మనుషుల రాకపోకలు తక్కువగా ఉండే ప్రాంతాలను అడ్డాగా చేసుకుని యువత, విద్యార్థులు మత్తులో జోగుతూ.. కేరింతలు కొడుతున్నారు.

విద్యార్థులే టార్గెట్‌
బడంగ్‌పేటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వెనకాల విద్యార్థులను టార్గెట్‌ చేసుకుని గంజాయి విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. గుర్రంగూడలో కొంత విద్యార్థులను (6నుంచి 10 తరగతులు) గంజాయి ముఠా సభ్యులు టార్గెట్‌ చేస్తున్నారు. ఈ దారిలో రాకపోకలు సాగిస్తున్న వారితో గంజాయి తాగిస్తూ క్రమంగా వారిని బానిసలుగా చేస్తున్నారని సమాచారం. పలు ఇంజనీరింగ్‌ కళాశాల్లో చదువుతున్న విద్యార్థులు కాలేజీలకు డుమ్మా కొడుతూ.. గంజాయి మత్తులో గడిపేస్తున్నారు.

చిన్న ప్యాకెట్లుగా విక్రయం
మీర్‌పేట్‌, బాలాపూర్‌, పహాడీషరీఫ్‌, ఆదిబట్ల ఠాణాల పరిధిలో పెద్ద మొత్తంలో గంజాయి సరఫరా చేస్తున్న కొంతమంది సభ్యులను పోలీసులు అనేక సార్లు పట్టుకున్నారు. దీంతో గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కొంతమంది ఆటోవాలాలకు గంజాయి అలవాటు చేయించి, వారితో సరఫరా చేయిస్తున్నారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన
చేతికొచ్చిన కొడుకులు, బిడ్డలు రోజు మత్తులో జోగుతుంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. గంజాయికి బానిసైన వారితో స్నేహం చేస్తున్న అమాయక యువత, విద్యార్థులు మెల్లగా ఆ ఉచ్చులోకి దిగుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలతో పాటు పరిసర ప్రాంతాల వారి దుస్థితిని చూసి పేరెంట్స్‌ కన్నీరుమున్నీరవుతున్నారు.

చెప్పేవారే లేరు..
మత్తులో బైకులు, కార్లు తీసుకెళ్తున్న యువత అతివేగం, ర్యాష్‌ డ్రైవింగ్‌తో రోడ్లపై భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. గంజాయి సేవిస్తున్న ముఠాల వద్దకు వెళ్లాలన్నా, స్థానిక యువతకు చెప్పాలన్నా అందరూ తెలిసిన వాళ్లే కావడంతో ఇటు పోలీసులు, అటు ప్రజాప్రతినిధులు వెనకడుగు వేస్తున్నారు. పది రోజుల క్రితం గంజాయి మత్తులో వచ్చిన ఓ యువకుడు బార్‌లోకి ప్రవేశించి వెయిటర్‌పై దాడి చేయడంతో 30కి పైగా కుట్లు పడి ప్రాణాలతో బయటపడ్డారు. మత్తులో జోగుతున్న యువత, ఎదురుడాడులకు దిగుతున్నా.. ఇది తప్పు అని నచ్చజెప్పేందుకు ఎవరూ సాహసించడం లేదు. దారి వెంట వెళ్లే యువతులు, బాలికలపై దాడులు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గురువారం శ్రీ 16 శ్రీ జనవరి శ్రీ 20251
1/1

గురువారం శ్రీ 16 శ్రీ జనవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement