Chris Jordan Slams Blasting 70 From 32 Balls In The Hundred League - Sakshi
Sakshi News home page

ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి ఊచకోత.. సిక్సర్ల సునామీ

Published Sat, Aug 5 2023 2:51 PM | Last Updated on Sat, Aug 5 2023 3:40 PM

Chris Jordan Slams Blasting 70 From 32 Balls In Hundred League - Sakshi

క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనూ కనీసం హాఫ్‌ సెంచరీ కూడా చేసి ఎరుగని ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ క్రిస్‌ జోర్డన్‌.. హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా వెల్ష్‌ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్‌ 4) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి విధ్వంసం సృష్టించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది ప్రత్యర్ధి బౌలర్లను గడగడలాడించాడు. జోర్డన్‌ సిక్సర్ల సునామీలో సౌతాంప్టన్‌ స్టేడియం తడిసి ముద్ద అయ్యింది.

ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న జోర్డన్‌ 7 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసి తన జట్టు భారీ స్కోర్‌ సాధించడానికి తోడ్పడ్డాడు. జోర్డన్‌ రాణించకపోతే అతను ప్రాతినిథ్యం వహిస్తున్న సదరన్‌ బ్రేవ్‌ నామమాత్రపు స్కోర్‌ కూడా చేయలేకపోయేది. 

జోర్డన్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్‌.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రేవ్‌ ఇన్నింగ్స్‌లో జోర్డన్‌ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. జోర్డన్‌తో పాటు ఫిన్‌ అలెన్‌ (21), కెప్టెన్‌ జేమ్స్‌ విన్స్‌ (18), డు ప్లూయ్‌ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రత్యర్ధి బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది, డేవిడ్‌ విల్లే, డేవిడ్‌ పెయిన్‌, వాన్‌ డెర్‌ మెర్వ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్‌.. లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయి, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వెల్ష్‌ఫైర్‌ ఇన్నింగ్స్‌లో లూక్‌ వెల్స్‌ (24), స్టీఫెన్‌ ఎస్కీనాజీ (31), గ్లెన్‌ ఫిలిప్‌ (22), డేవిడ్‌ విల్లే (31) రాణించగా.. బ్రేవ్‌ బౌలర్లలో క్రెయిగ్‌ ఓవర్టన్‌ (2/41), టైమాల్‌ మిల్స్‌ (2/23), రెహాన్‌ అహ్మద్‌ (2/28) సత్తా చాటారు. ఈ గెలుపుతో బ్రేవ్‌ ప్రస్తుత ఎడిషన్‌లో బోణీ కొట్టింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement