సాక్షి ప్రతినిధి, నెల్లూరు: స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి స్కాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో జిల్లాలో రెండో రోజు కూడా ఆ పార్టీ నేతల నుంచి స్పందన కనిపించలేదు. సొంత పార్టీ నేతలే నిరసనలు, ఆందోళనల వైపు వెళ్లకపోవడం గమనార్హం. అవినీతి కేసులో చంద్రబాబును అన్ని ఆధారాలతో అరెస్ట్ చేయడంతో అందుకు మద్దతిస్తే ప్రజల్లో చులకన అవుతామేమోనని టీడీపీ నేతలకు భయం పట్టుకుందో ఏమో జిల్లాలో ఎక్కడా కూడా నిరసనలు, ఆందోళనలంటూ రోడ్లపై కనిపించిన దాఖలాలు లేవు. టీడీపీ కీలక నేతలను మాత్రం పోలీసులు రెండో రోజు కూడా ఇళ్లకే పరిమితం చేశారు. ద్వితీయ శ్రేణి క్యాడర్ నుంచి కూడా జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు.
పచ్చ క్యాడర్‌లో నిరుత్సాహం
జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పతనావస్థలో ఉన్న తరుణంలో స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కేసులో ఆ పార్టీ అధినేత అరెస్ట్ అయి రిమాండ్‌కు వెళ్లడంతో పార్టీ కేడర్‌లో మరింత నిరుత్సాహం నెలకొంది. జిల్లాలో ఎక్కడ చూసినా చంద్రబాబు అవినీతిపైనే తీవ్రంగా చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తాను నిప్పు అంటూ చెప్పుకుని తిరిగిన చంద్రబాబు మరో కోణం బయటపడడంపై పార్టీలో చర్చనీయాంశమైంది.
అంతేకాక ఉదయగిరి, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలుగా ఉన్న నేతలకు ఆ పార్టీ టికెట్‌లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చి పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. నెల్లూరు సిటీ, సర్వేపల్లి, కందుకూరు నియోజకవర్గాల్లో వర్గపోరు తీవ్రంగా ఉంది. ఈ రాజకీయ పరిణామాల మధ్య క్యాడర్ పూర్తిస్థాయిలో నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చే చాన్స్ లేదని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ ముఖం చాటేసింది.
పోలీసుల ముందస్తు చర్యలు
చంద్రబాబు అవినీతి కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయడంతో ఎక్కడా నిరసనలు, ఆందోళనలు జరగలేదు. టీడీపీ నియోజకవర్గస్థాయి నేతలను ఇళ్లకే పరిమితమయ్యేలా చేయడంతో, సెకండ్ క్యాడర్ ముఖం చాటెయ్యడంతో ఎక్కడా ఆందోళనలు జరగలేదు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇంటి ముందు రెండో రోజు ఆయన అనుచరవర్గం హడావుడి చేయబోయినా పోలీసులు వారి ప్రయత్నాలను భగ్నం చేశారు. కందుకూరులో పార్టీ ఇన్‌చార్జిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరెక్కడా కూడా టీడీపీ నేతలు రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment