ప్రకృతి శోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు.. ప్రాచీన ఆలయాలు, శిల్పకళకు అద్దంపట్టే దేవాలయాలు, తిరుమల గిరులను పోలిన పర్వత శ్రేణులు.. అడుగడుగునా కనిపించే అలనాటి రాజమందిరాలు.. ఇలా ఎన్నెన్నో విశిష్టతలతో నిండిన ప్రాంతాలు పర్యాటక శోభితం కానున్నాయి. అవే ఉదయగిరి నియోజకవర్గంలోని సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలు. వీటిని అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్లుగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, రాయలు ఏలిన ఈ ప్రాంతంలో ఒకప్పుడు రతనాలు రాసులు పోసి అమ్మారని ప్రతీతి. రెండు శతాబ్దాలకు పూర్వం వరకు కూడా మహోన్నతంగా ఒక వెలుగు వెలిగిన ఉదయగిరి ప్రాంతం అనంతరం తన ప్రాభవాన్ని కోల్పోయింది. అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా మొండి గోడలు, శిథిల రాజభవనాలు నేటికీ ఈ ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వంద కి.మీ. దూరంలో నీటి ఆధారం లేని మెట్టప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. త్వరలో ఈ ప్రాంతం పర్యాటక శోభతో పరిఢవిల్లనుంది.
తొలి సూర్యకిరణాలు పడే గిరి
సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉదయగిరి కోట ఉంది. ఈ కోటపై 20 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ. వ్యాసార్థంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయించే సూర్యుడి తొలి కిరణాలు ఈ కొండ(గిరి)పైనే పడతాయి. విజయనగర సామ్రాజ్యంలో సూర్యకిరణాలు ఒక్క కొండ కోటపైనే ముందుగా పడుతుండడంతో దీనికి ఉదయగిరిగా నామకరణం చేశారని పెద్దలు చెబుతుంటారు. ఇంతటి చారిత్రాత్మక నేపథ్యం గల ఉదయగిరి దుర్గాన్ని శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలుగా ఇక్కడే మకాంవేసి పాలన సాగించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
అభివృద్ధిని మరిచిన గత పాలకులు
ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. దీనిపై గత ఐదు దశాబ్దాలుగా ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన గత పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్నికల వేళ హామీలు గుప్పించిన పారీ్టలు అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీలు మరిచిపోయాయి. దీంతో పర్యాటకంగా ఈ ప్రాంత అభివృద్ధి కలగానే మిగిలిపోయింది.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఎంతో ప్రాశస్త్యం ఉన్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు, ఆ రెండు ప్రాంతాల్లో పర్యాటకులకు వసతులు కలి్పంచేందుకు అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్కులు, తాగునీటి వసతులు, రిఫ్రెష్ గదులు, గార్డెన్స్, జిమ్‌లు, పిట్‌నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతిని వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా.. 45 రకాల పనులకు ఒక్కొక్క ప్రాంతంలో వసతులు కలి్పంచేందుకు రూ.2.78. కోట్ల వంతున అంచనాలతో ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి
ఉదయగిరిని 1512లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించారు. గజపతులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణి మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేర్లు, సొరంగమార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ దర్శనమిస్తున్నాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్‌రోడ్డులో పాదచారుల కోసం రాయిలో తవి్వన బావి తానాబావిగా ప్రసిద్ధి. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిర్మించిన ప్రార్థనా మందిరం, తహసీల్దార్ కార్యాలయ భవన సముదాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి.
చూడదగిన ప్రదేశాలు
ఉదయగిరికి 33 కి.మీ. దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన శైవక్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం ఉంది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను కూడా అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ. దూరంలో పల్లవులు అద్భుత శిల్పాకళా నైపుణ్యంతో ఒకే రాతిలో చెక్కిన దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాల నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అక్కడి నుంచి మరో 24 కి.మీ. ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం, మరో 10 కి.మీ. దూరంలో హనుముని కొండ, మరో 25 కి.మీ. దూరంలో వెంగమాంబ ఆలయాన్ని సందర్శించవచ్చు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన మేకపాటి
ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్రం నుంచి కూడా మరికొంత నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి దోహదపడాలని వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉదయగిరి దుర్గానికి వెళ్లేందుకు రోప్ వేతోపాటు ఉదయగిరిలో ఉన్న ప్రాచీన దేవాలయాలను జీవనోద్ధరణ చేసేలా ప్రతిపాదనలు అందజేశారు.
పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు
ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే సుమారు రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. త్వరలో నిధులు మంజూరైన వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. రాయలు ఏలిన నేల కావడంతో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది.
– చంద్రశేఖర్, డీఎఫ్‌ఓ, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment