No Headline
కావలి: కళాశాలల విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి విక్రయాలను వ్యాపారులు విస్తరిస్తున్నారు. కావలిలోని విక్రమ సింహపురి పీజీ కళాశాల సమీపంలో ఇటీవల గంజాయి విక్రయాలు చేస్తున్న ఓ ముఠా పోలీసులకు పట్టుబడింది. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. రాజమండ్రి, విశాఖ నుంచి గంజాయిని హోల్‌సేల్‌గా కొనుగోలు చిన్నచిన్న ప్యాకెట్లుగా కావలి కేంద్రంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గంజాయి రిటైల్ వ్యాపారుల నెట్‌వర్క్ విస్తరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ నెట్‌వర్క్ ముఠాలోని కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా రిటైల్, హోల్‌సేల్ వ్యాపారుల పట్టుకునేందుకు వేట సాగిస్తున్నారు.
డొంక కదిలించే పనిలో పోలీసులు
ఈ గంజాయి ముఠా అరెస్ట్ తర్వాత కావలి పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ముఠా ఎంతకాలంగా గంజాయి అమ్మకాలు చేస్తుంది, ఏఏ ప్రాంతాల్లో చేస్తుంది, వీరి నెట్‌వర్క్ విస్తరణ పరిధి ఏ మేరకు ఉందో, ఇంకా ఎంత మంది ఈ ముఠాతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉన్నాయి, ఈ ముఠా గంజాయి అమ్మే ప్రదేశాలు, వినియోగించే వ్యక్తులు, గంజాయి అమ్మకాల ద్వారా కూడ బెట్టిన ఆస్తుల వరకు తదితర విషయాలపై కూపీలాగే పనిలో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. వీరికి తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం దారకొండకు చెందిన ఓ వ్యక్తి గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇంకెవరెవరికి గంజాయి సరఫరా చేస్తున్నాడనే తదితర అంశాలపై లోతుగా దర్యాప్తు చేయడానికి పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
విక్రయాల్లో మహిళలే కీలక పాత్రదారులు
గంజాయి విక్రయాల్లో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్న విషయం వెల్లడవుతోంది. మాదక ద్రవ్యాలు రవాణా, అమ్మకాల్లో మహిళల భాగస్వామ్యం ఉందంటే అదొక విస్తృతమైన వ్యవస్థీకృత చీకటి వ్యవస్థగా పోలీసులు పరిగణిస్తున్నారు. కావలిలో పట్టుబడిన గంజాయి ముఠాలో ముగ్గురు మహిళలు ఉండడంతో పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. కావలిలో గంజాయి నిల్వలు కలిగి అమ్మకాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి ముఠాలో భార్యాభర్తలైన రెండు జంటలతోపాటు పట్టణానికి చెందిన మరో మహిళ ఉండడం గమనార్హం. పట్టణంలోని పెద్దపవని రోడ్డులో ఉన్న విక్రమ సింహపురి పీజీ కళాశాల వద్ద నివసించే షేక్ మస్తానమ్మ, షేక్ గౌస్‌బాషా, ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాలెపాడు గ్రామానికి చెందిన షేక్ గౌస్‌బాషా, షేక్ రసూల్ బీ దంపతులతోపాటు వైకుంఠపురం ప్రాంతానికి చెందిన షేక్ మీరాబీ గంజాయి ముఠాలో కీలక సభ్యులుగా ఉన్నారు. మొత్తం 8 మందితో కూడిన ఈ ముఠాలో మొదటి నిందితురాలుగా కావలికి చెందిన మహిళ ఉన్నట్లుగా సమాచారం. ఈ కేసులో దారకొండకు చెందిన గంజాయి సరఫరా దారుడిని అరెస్ట్ చేయాల్సి ఉంది.
గడిచిన కొద్ది నెలలుగా జిల్లాలోని కళాశాలల విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో గంజాయి పెంపకం, విక్రయాలను సమూలంగా నిర్వీర్యం చేస్తే.. కూటమి ప్రభుత్వ వచ్చాక వీరందరూ ముసుగులు తొలగించి బయటకు వస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గంజాయి సాగు, విక్రయాలు మళ్లీ పెరిగాయని ఇటీవల అరెస్ట్‌లు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయి తోటల నుంచే నిరోధిస్తే.. కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించింది. ప్రభుత్వ పాలకుల నుంచి పోలీస్ యంత్రాంగం అటెన్షన్ అంతా కూడా ప్రతిపక్షం నిర్వీర్యం దిశగా పనిచేస్తోంది. ఈ క్రమంలో గంజాయి విక్రేతలు తమ కోరలు చాచి జూలు విధిస్తున్నారు. గంజాయి పండించే ప్రాంతానికి చెందిన వ్యక్తితో సంబంధాలు పెట్టుకుని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తమ నెట్‌వర్క్ కలిగి ఉన్న ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన రాజు అంతర్ రాష్ట్ర గంజాయి హోల్‌సేల్ సరఫరాదారుడిగా కావలి పోలీసుల రికార్డుల్లోకి తాజాగా ఎక్కాడు. బెంగళూరుకు చెందిన వేలును కావలి పోలీసులు పట్టుకుంటే వైజాగ్ రాజు విషయం బయటకు వచ్చింది. దారకొండ, విశాఖ ప్రాంతాలకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులను పట్టుకుంటే.. పెద్ద డొంక కదిలే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment