నేడు ఐటీఐలో జాబ్‌మేళా
నెల్లూరు (టౌన్): స్థానిక వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో సోమవారం ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళాకు డైకిన్, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమర్‌రాజా బ్యాటరీస్, భార్గవి ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐఐటీ డిప్లొమా చదివిన నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరు కావచ్చన్నారు. మరిన్ని వివరాలకు 94944 56236, 63015 29271 నంబర్లలో సంప్రదించాలన్నారు.
పెద్దాస్పత్రిలో జికా వైరస్
బాధితుల వార్డు
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జికా వైరస్ బాధితుల కోసం ముందస్తుగా వార్డును ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో జికా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురంలో ఒక బాలుడికి జికా వైరస్ సోకినట్లు ముంబయిలోని ఒక ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారించడం జరిగింది. దీంతో బాలుడిని చైన్నె ఎగ్మూర్‌లోని బేబీ ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దాస్పత్రిలోని పల్మనాలజీ విభాగంలోని ఒక ఫ్లోర్‌లో 5 పడకలతో ఒక వార్డును ప్రత్యేకంగా సిద్ధం చేశారు. అక్కడ తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఇతర వసతులతో పాటు ఐసీయూ తరహాలో వెంటిలేటర్ తదితర సౌకర్యాలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు జికా వైరస్ కేసులు రానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ సిద్ధానాయక్ తెలిపారు. ఒక వేళ జికా కేసులు వస్తే సందర్భాన్ని బట్టి పడకల సంఖ్యను పెంచుతామని తెలిపారు.
పార్కు స్థలంలో
భవన నిర్మాణంపై చర్యలు
నెల్లూరు (బారకాసు): పార్కు స్థలాన్ని నిర్మించి భవన నిర్మాణం చేపట్టడంపై నగర పాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ‘లంచాల పునాదులపై ఆక్రమ నిర్మాణాలు’ అనే శీర్షిక ఈ నెల 19న ‘సాక్షి’లో ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. నగరంలోని బీవీనగర్‌లో జీవీఆర్‌ఆర్ కళాశాల సమీపంలో ప్రభుత్వ పార్కు స్థలం ఆక్రమించి వాణిజ్య భవన సముదాయం నిర్మించిన విషయం వాస్తవమేనని ఎన్‌ఎంసీ అధికారులు గుర్తించారు. దీంతో ఆ భవన యజమానికి ఇప్పటికే నోటీసు జారీ చేశారు. పార్కు ఆక్రమించిన విషయాన్ని ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఎన్‌ఎంసీ అధికారులు తెలియజేశారు.
ఉచితంగానే
స్మార్ట్ మీటర్లు
● కొత్త సర్వీసులకు అదనంగా
వసూలు చేస్తే చర్యలు
నెల్లూరు (వీఆర్సీ సెంటర్): జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వినియోగదారులు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదని, ఉచితంగా మీటర్లను బిగిస్తామని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్ స్పష్టం చేశారు. నగరంలోని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ప్రధాన కార్యాలయం విద్యుత్ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా విద్యుత్ సర్వీసు కనెక్షన్లు కావాలనుకునే వారు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన రుసుం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ సిబ్బంది అదనంగా నగదు వసూలు చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరి ంచారు. నూతనంగా గృహ విద్యుత్ సర్వీసు అవసరమైన వారు కిలో వాట్‌కు రూ.1,500, అంతకంటే ఎక్కువ అవసరమైతే.. ప్రతి ఒక్క కిలో వాట్‌కు రూ.2,000, సెక్యూరిటీ డిపాజిట్‌గా మరో రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే కమర్షియల్ (వాణిజ్య వినియోగానికి) రూ.2,000లతోపాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.800 చెల్లించాలన్నారు. గృహ వినియోగదారులు త్రీఫేస్ విద్యుత్ కనెక్షన్‌కు అయితే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుందని, వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు కిలోవాట్‌కు రూ.1,500లతోపాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.60 చెల్లించాలన్నారు. ఈ మొత్తాలకంటే విద్యుత్ సిబ్బంది వినియోగదారుల నుంచి అదనంగా నగదు వసూలు చేస్తే ఫిర్యాదు చేస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment