ఏపీలో బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేయాలి
నెల్లూరు (టౌన్): ఏపీలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జిల్లా కో ఆర్డినేటర్ పిచ్చయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సర్వోదయ డిగ్రీ కళాశాలలోని వర్సిటీ అధ్యయన కేంద్రం ఎదుట అకడమిక్ కౌన్సిలర్స్, ఉద్యోగులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో అడ్మిషన్లు నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఏపీ విద్యార్థులు ఇరకాటంలో పడ్డారన్నారు. కోర్సులు పూర్తి కాని విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. మొత్తం డిగ్రీ, పీజీ ఎన్‌రోల్‌మెంట్‌లో 12 శాతం దూర విద్య విద్యార్థులు ఉన్నారన్నారు. విశ్వవిద్యాలయంలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే ఉన్నట్లు వివరించారు. మొత్తం విద్యార్థుల్లో 48 శాతం మహిళలు ఉన్నారని తెలిపారు. ఏపీలోని అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో తెలంగాణకు రూ.21 కోట్ల నిధులు వెళ్లాయన్నారు. ప్రతి ఏటా రెండు సార్లు అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి యూనివర్సిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటే ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉందన్నారు. అధ్యయన కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ఇంకా జీతాలు రాలేదని, వారికి త్వరగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యయన కేంద్రం ప్రిన్సిపల్ రజనికుమారి, అకడమిక్ కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment