గిట్టుబాటు కల్పించాలంటున్న రైతులు
ఎగుమతులు పెరిగినా దక్కని లాభాలు
సాగుకు అనుగుణంగా సహకరించని మార్కెట్
రేటు కట్టడంలో దోబూచులాట
నిలకడ లేని నిమ్మ ధరలు రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కాయల కోత సమయంలో చక్కటి రేటు పలుకుతున్నాయి. మార్కెట్‌కు చేరగానే ఒక్కసారిగా పతనమవుతున్నాయి. అన్నదాతకు పెట్టుబడి కూడా గిట్టుబాటు కాని దుస్థితిని కల్పిస్తున్నాయి. అయితే వ్యాపారులు మాత్రం వివిధ ప్రాంతాలకు నిమ్మను ఎగుమతి చేసి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. ధరలను శాసిస్తూ.. కర్షకుడి శ్రమను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తమ అంతస్తులు పెంచుకుంటున్నారు.
సైదాపురం: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, ఉదయగిరి నియోజకవర్గాల్లో నిమ్మ సాగు అధికంగా ఉంది. మిగిలిన మండలాల్లో అక్కడక్కడా ఉంది. మొత్తంగా సుమారు 30 వేల ఎకరాలకు పైగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది అదనంగా మరో రెండు వేల ఎకరాల్లో తోటల పెంపకం చేపట్టారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 70 శాతం మంది రైతులు దీనిపైనే ఆధారపడ్డారు. మద్దతు ధర విషయంలో ఇబ్బందులు పడుతున్నా, నిమ్మను మాత్రం వదలని పరిస్థితి. పసిబిడ్డలను పెంచినట్టు మూడేళ్లపాటు మొక్కల సంరక్షణ చేపడుతుంటారు. నాలుగో ఏడాది నుంచి నిమ్మ కాయలు కోత మొదలుపెడుతుంటారు. పొదలకూరు, గూడూరులో యార్డులున్నాయి.
గాలివాటంగా మార్కెట్
రూ.లక్షల పెట్టుబడితో నిమ్మ తోటలు సాగు చేస్తే, ధరలు మాత్రం రైతులను ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉన్నాయి. దిగుబడి బాగా వచ్చినప్పుడు ధర ఉండదు. అరకొర కాయలు వస్తే రేటు ఆకాశాన్నంటుతోంది. నిమ్మకాయ లోడ్‌లు అధికంగా వస్తే రైతులకు రేటు తగ్గించి చెల్లిస్తుంటారు. తక్కువగా వస్తే కాస్త గిట్టుబాటు ధర ఇస్తుంటారు. వ్యాపారులు మాత్రం దేశంని వివిధ రాష్ట్రాలకు ఎగుమతులు చేసి అధిక లాభాలను కళ్లజూస్తునానరు. ఈ క్రమంలో గాలివాటంగా మార్కెట్ మారిపోవడంతో రైతులు చేసేదిలేక ఇచ్చింది తీసుకుని వెళ్లిపోతున్నారు.
ప్రోత్సాహకాలు అందించాలి
ఒకప్పుడు నిమ్మ రైతులకు మందులు, వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించేవారు. కొన్నేళ్లుగా ఉద్యాన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే మార్కెట్ కమిటీలను పర్యవేక్షించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపట్టాలి. లేకుంటే మా కష్టం మాకు దక్కదు.
– వెంకటసుబ్బరాజు, నిమ్మ రైతు, లింగనపాళెం, సైదాపురం మండలం
సాగు విస్తీర్ణం పెరుగుతోంది
గతంలో ఎన్నడూలేని విధంగా నిమ్మ తోటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. రైతులకు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్‌లో గిట్టు బాటు ధర కల్పించేందుకు సహకరిస్తున్నాం. సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– ఆనంద్, ఉద్యాన శాఖాదికారి,పొదలకూరు
Comments
Please login to add a commentAdd a comment