హత్య కేసులో నిందితుల అరెస్ట్
కావలి: అల్లూరు మండలం నార్త్‌మోపూరు ఎస్సీ కాలనీకి చెందిన చేజర్ల కార్తీక్ (22) అనే యువకుడిని సుత్తితో కొట్టి హతమార్చిన ఘటనలో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు కావలి డీఎస్పీ పీ శ్రీధర్ తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. నార్త్‌మోపూరు ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈనెల 1వ తేదీ వేకువన కేకలు వేస్తూ మోటార్‌బైక్‌లపై తిరుగుతున్నారు. అదే కాలనీకి చెందిన నిరంజన్ అనే వ్యక్తి వారిని ప్రశ్నించడంతో గొడవ జరిగింది. దీంతో నిరజంన్‌ను చంపాలని బైక్‌లపై రాడ్లు, సుత్తితో మళ్లీ వచ్చిన యువకులు దాడికి దిగుతుండగా అదే ప్రాంతానికి చెందిన కార్తీక్ సర్దిచెప్పబోయాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు కార్తీక్ తలపై సుత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేసి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులైన కొమ్మి సుధీర్, తుమ్మతాటి ఆదిత్య, కొమ్మి నరేష్, అరగల పౌలు, కొమ్మి అహారాన్, అజ్జం హేమంత్ కుమార్, కోటపూడి జగదీష్‌లను అరెస్ట్ చేయగా ఏ7 అయిన మనోజ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు డీఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment