పచ్చ మూకల అత్యుత్సాహం | - | Sakshi
Sakshi News home page

పచ్చ మూకల అత్యుత్సాహం

Published Thu, Jan 16 2025 7:21 AM | Last Updated on Thu, Jan 16 2025 7:21 AM

పచ్చ

పచ్చ మూకల అత్యుత్సాహం

సోమందేపల్లి: మంత్రి సవిత పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సోమందేపల్లిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ‘పచ్చ’ మూకలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. వైఎస్సార్‌ సర్కిల్‌లో ఇది వరకే ఉన్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో కూడిన ఫ్లెక్సీని దౌర్జన్యంగా చింపేశారు. ఘటనపై వైస్‌ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి, ఫ్లెక్సీలు చింపి వేసిన వారిపై, రెచ్చగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై ఏఎస్‌ఐ మురళి కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు అశోక్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు కళ్యాణ్‌, న్యాయవాది బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఇరువర్గాల ఘర్షణ –

ఏడుగురికి గాయాలు

బత్తలపల్లి: పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం అనంతసాగరం గ్రామానికి చెందిన చెరుకూరి ఈశ్వరమ్మ, చెరుకూరి ఈశ్వరయ్య వర్గాల మధ్య కొంత కాలంగా ఓ బంగారు గొలుసు విషయంగా వివాదం నెలకొంది. ఈ విషయంగా ఈశ్వరయ్య మేనల్లుడు ప్రవీణ్‌పై కేసు నమోదు చేశారు. తన మేనల్లుడుపై అక్రమంగా కేసు నమోదు చేయించారంటూ తరచూ ఈశ్వరమ్మ వర్గంతో ఈశ్వరయ్య వర్గీయులు గొడవ పడేవారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకోవడంతో ఈశ్వరమ్మ, హేమంత్‌, రామాంజనేయులు, ఈశ్వరయ్య, ప్రవీణ్‌, గవ్వల శివయ్య, గవ్వల ఈశ్వరమ్మ గాయపడ్డారు. ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు చియ్యేడుకు చెందిన హేమంత్‌, నాగార్జున, రామాంజనేయులు, అనంతసాగరానికి చెందిన శివయ్య, ఆదెప్పతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు గవ్వల ప్రవీణ్‌, శివయ్య, ఈశ్వర్యతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

పెరిగిన టెంకాయల

విక్రయ ఆదాయం

గుత్తి రూరల్‌: మండలంలోని బాచుపల్లి శివారున 44వ జాతీయ రహదారి పక్కన వెలసిన బాటసుంకులమ్మ ఆలయంలో టెంకాలయ విక్రయానికి మంగళవారం వేలం నిర్వహించారు. వేలం దక్కించుకున్న వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ ఆలయం వద్ద టెంకాయలను విక్రయించుకునే హక్కును పొందుతారు. ఈ క్రమంలో మొత్తం 12 మంది టెండర్‌దారులు రూ.500 ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య రూ.35.60 లక్షలతో కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నారు. గ తేడాది రూ.28 లక్షలకు పలికిన వేలం పాట ఈ ఏడాది రూ.35.60 లక్షలకు ఖరారు కావడంతో రూ.7.60 లక్షల అదనపు ఆదాయం సమకూరినట్లైంది. కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు కర్లకుంట రమేష్‌బాబు, అంబటి నరసింహులు, వెంకట్రాముడు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పచ్చ మూకల అత్యుత్సాహం1
1/1

పచ్చ మూకల అత్యుత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement