కష్టాలు రియల్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ):
ఒకటో తేదీ వస్తుందంటే రియల్టర్లు బెదిరిపోతున్నారు. నూతన సంవత్సరం నాటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు గత నెల రోజులుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ధరల పెంపుపై రియల్టర్లకు సమాచా రం వస్తూనే ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త ధరలు వస్తాయని తెలియడంతో వారు లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ వ్యాపారం పూర్తిగా కుదేలైందని రియల్టర్లు, భూ యజమానులు చెబుతున్నారు. గతంలో ఎన్న డూ లేని విధంగా 30 నుంచి 40శాతం పెంచడం ఇదే మొదటి సారి. అంతేకాకుండా ఎప్పుడు ధరలు పెంచినా ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం, ఆయా సబ్‌రిజిస్ట్రార్ల సలహాలు, సూచనలు పాటించడం ఆనవాయితీ.
ఈ ఏడాది మాత్రం అవేమీ తమకు అవసరం లేదన్నట్లు ధరలు పెంచడమే లక్ష్యంగా కూటమి ప్ర భుత్వం నిర్ణయించుకుంది. అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యావసరాలు, విద్యుత్ చార్జీలు, పెట్రోలు, నూనె, చికెన్, కూరగాయలు ధరలతో పాటు చివరికి భూములు ధరలు సైతం పెంచేశారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ధరలు పెంచబోమని ఎవ్వరు భయపడవద్దని ప్రతి రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక తమకు నచ్చినట్లు అన్ని రకాలు ధరలు పెంచేశారు.
వైఎస్సార్ సీపీ హయాంలో 10 శాతమే పెంపు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019లో కేవలం 10 శాతం మాత్రమే ధరలు పెంచారు. ఈ ఏడాది మాత్రం ఎవరూ ఊహించని రీతిలో 30 నుంచి 40 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 2019లో ఆగస్టులో ధరలు పెంచినా 10శాతం (సీలింగ్) మాత్రమే పెంచారు. ప్రభుత్వ నిబంధనలు, పాత విధానాలు తమకేం పట్టనట్లు ఏకంగా భారీగా భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నామమాత్రంగా ఒక కమిటీ వేసినా ఆయా కమిటి నిర్ణయాలు పట్టించుకునే పరిస్ధితులు లేనట్లే కనిపిస్తోంది.
కిక్కిరిసిపోతున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు
జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. దాదాపుగా గత వారం రోజులుగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిండా కొనుగోలు, అమ్మకందారులతో నిండిపోతోంది. ప్రజలంతా ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంతో సిబ్బంది తగిన సేవలు అందించలేకపోతున్నారు. అంతేకాకుండా ఒక్కసారిగా ప్రజలంతా రావడంతో వేగంగా పనిచేసే ప్రయత్నంలో భాగంగా తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్లు క్షుణ్ణంగా పరిశీలించేంత సమయం కూడా ఉండడం లేదు. దీంతో కొనుగోలు, అమ్మకందారులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చు. దీనికి సాంకేతిక పరమైన సమస్యలు వస్తున్నాయి. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులేమి పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మాత్రమే చూసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్త ఏడాదిలో రిజిస్ట్రేషన్
చార్జీల పెంపు
ఎన్నడూ లేని విధంగా
అమాంతంగా ధరల పెంపు
కిక్కిరిసిపోతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
పనిచేయని సర్వర్లు
ఇబ్బందుల్లో రిజిస్ట్రేషన్ దారులు
Comments
Please login to add a commentAdd a comment