వైభవంగా కర్పూరజ్యోతి దర్శనాలు
శ్రీకాకుళం కల్చరల్: మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శబరిమలలో మకర జ్యోతి దర్శన సమయంలో బలగ అయ్యప్పస్వామి దేవాలయంలో కర్పూర జ్యోతి దర్శనాలు ఏర్పాటు చేశారు. బలగ అయ్యప్ప స్వామి ఆలయంలో కర్పూర జ్యోతిని వెలిగించారు. అర్చకులు దేవరకొండ శంకరనారాయణ శర్మ ఆధ్వర్యంలో మణికంఠుని ఉత్సవమూర్తిని పల్లకిలో ఉంచి ఆలయ పరిసరాలలో తిరువీధి నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కర్పూరాలను భక్తులకు అందచేయగా, వాటిని ఆలయ ఆవరణలోని బానలో వేయగా.. పెద్దమంటలా ఏర్పడి మకరజ్యోతిని తలపించింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్పస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సువర్ణ మణిమయ మకుటాభరణాలతో స్వామి వారి దివ్యాలంకరణ వైభవాన్ని భక్తులు కనులారా వీక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రెడ్డి చిరంజీవులు, కార్యదర్శి దానేటి రాజారావు తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప శిఖర జ్యోతి దర్శనాలు..
పాతశ్రీకాకుళంలోని అయ్యప్పదేవాలయంలో కర్పూర జ్యోతి శిఖర దర్శనాలు, స్వామికి పడిపూజలు చేశారు. అర్చకులు బాలు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు పర్యవేక్షణలో 18 మెట్లపై కర్పూర జ్యోతులను వెలిగించారు. ఆలయ శిఖరంపైనా కర్పూర జ్యోతిని వెలిగించి భక్తులకు జ్యోతి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతనామాలతో పుష్పాభిషేకం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment