గోవిందరాజ స్వామి ఆలయంలో వస్త్రాలను ప్రదర్శనగా తీసుకు వస్తున్న అర్చకులు, అధికారులు
తిరుపతి కల్చరల్: గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాల్లో సోమవారం సాయంత్రం ఆణివార ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు ఆణివార ఆస్థానం. నాటి నుంచి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్‌ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు. ఆణివార ఆస్థానంలో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. అలాగే కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం గరుడాళ్వార్ ఎదురుగా సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు. అలాగే అలిపిరి పాదాల మండపం వద్దనున్న లక్ష్మీనారాయణస్వామి ఆలయంలోనూ ఆణివార ఆస్థానం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment