పెరిగిన భూముల ధరలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన భూముల ధరలు

Published Mon, Dec 11 2023 9:38 AM | Last Updated on Mon, Dec 11 2023 9:38 AM

నూతనంగా నిర్మించిన పరాంతక దేవి మార్గం - Sakshi

నూతనంగా నిర్మించిన పరాంతక దేవి మార్గం

● నవీన తిరుపతి ఆవిష్కరణకు మోకాలడ్డుతున్న ఎల్లోమీడియా ● మాస్టర్‌ ప్లాన్‌ రహదారులపై తప్పుడు కథనాలు ● కమర్షియల్‌ ఏరియాలను వ్యవసాయ భూములంటూ అసత్యాలు ● అభివృద్ధి ప్రదాతలపై బురదజల్లేందుకే ఆరోపణలు

టీడీఆర్‌ బాండ్ల పైనా అసత్యాలే..

రోడ్డు వేయాలనుకున్నప్పుడు ముందుగా సర్వే చేసి ఆ ప్రకారం స్థలం కోల్పోయిన యజమానులను గుర్తించి ముందుగా నోటీసులు ఇస్తారు. ఆపై యజమానులు అంగీకారంతో సేకరించిన స్థలాన్ని గిఫ్ట్‌ డిడ్‌ కింద తీసుకుంటారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్ణయించిన మేరకు సదు భూ యజమానికి నిబంధనల ప్రకారం టీడీఆర్‌ బాండ్‌ అందజేస్తారు. 18 మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల కోసం మొత్తం 2,31,840 చదరపు గజాలు సేకరించారు. ఇప్పటి వరకు దాదాపు 11 రోడ్లు పూర్తి చేయడంతో ఆ ప్రాంతాలకు చెందిన 330 మందికి టీడీఆర్‌ బాండ్లు అందజేశారు. మిగిలిన రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇవి పూర్తి చేసుకుంటే మరో 800 మందికి టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కాకుండానే అందరికీ బాండ్లు ఇవ్వలేదంటూ పచ్చ పత్రికలు ప్రచురించిన కథనాలకు అధికారులు అవాక్కవుతున్నారు.

తిరుపతి తుడా : తిరుపతి నగరాభివృద్ధికి చేటు చేసేలా ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాస్తోంది. పాలకులు చిత్తశుద్ధితో తిరునగరి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుంటే అనవసర విమర్శలతో దుష్ప్రచారం చేస్తోంది. అసత్య కథనాలతో ప్రజలకు ఎనలేని నష్టం చేస్తున్నామనే కనీస స్పృహ కూడా లేకుండా విచ్చలవిడిగా వ్యవహరిస్తోంది. రాజకీయ దురుద్ధేశాలను ఆపారించేందుకే అభాండాలు మోపుతోంది. తాము రాసిందే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నం తిరుపతి అభివృద్ధికి ప్రమాదకరంగా మారుతోంది. ఓ పార్టీకి రాజకీయ నష్టం కలిగించి తద్వారా మరో పార్టీకి లాభం చేకూర్చే విధంగా అవాస్తవ కథనాలను ప్రచురిస్తున్న విషయాన్ని ప్రజానీకం గమనిస్తోంది.

భవిష్యత్‌లో ఆదాయ వనరులు

ప్రజలకు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి చేయడం మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాధ్యత. ఈ క్రమంలో మరో 5వేల ఎకరాల్లో విస్తరణ, ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించడం, తిరుపతికి కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా నగర తూర్పు ప్రాంతంలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం కార్పొరేషన్‌ నుంచి రూ.37కోట్లు కేటాయించారు. కొత్తగా ఏర్పడ్డ రోడ్లలో వందలాది భవనాలు వెలుస్తున్నాయి. భారీ అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, పలు కంపెనీలు నిర్మితమవుతున్నాయి. దీంతో వీఎల్‌టీ, భవన నిర్మాణ అనుమతులు, ట్యాక్స్‌, యూడీఎస్‌, వాటర్‌ కనెక్షన్లు, ట్రేడ్‌ లైస్సెన్స్‌ల ద్వారా కార్పొరేషన్‌కు కోట్లాది రూపాయలు సమకూరుతున్నాయి. మరో 5 ఏళ్లలో సుమారు 3,500 ఎకరాల్లో తిరుపతి విస్తరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అంటే కేవలం రూ.37కోట్లతో అభివృద్ధి చేసిన ఆ ప్రాంతాల నుంచి సుమారు రూ.200 కోట్ల మేర కార్పొరేషన్‌కు ఆదాయం చేకూరనుంది. ప్రస్తుతం వంద కోట్ల వార్షిక బడ్జెట్‌తో ఉన్న కార్పొరేషన్‌ రూ.300కోట్లకు పెరగనుంది.

టీడీపీ హయాంలోనే అనుమతులు

గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి తుడా చైర్మన్‌గా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ వ్యవహరించారు. 40 ఏళ్ల బృహత్‌ ప్రణాళికతో రూ.6 కోట్లు వెచ్చించి తుడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. 2019 మార్చిలో సార్వత్రిక ఎన్నికల ముందు మాస్టర్‌ ప్లాన్‌ను ఆమోదించారు. అప్పటి ప్లాన్‌ ప్రకారం నగర పరిసర ప్రాంతాలలోని 18 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ అనుమతితో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవ ఆమోదంతో అభివృద్ధి చేస్తున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను ఇప్పటికి ఇప్పుడు ఆమోదించినట్లు, అధికార పార్టీ నాయకుల సొంత భూములకు రోడ్లు వేసుకుంటున్నారంటూ టీడీపీ నేతలు, పచ్చ పత్రికలు తప్పుడు ఆరోపణలు చేస్తుండడం గమనార్హం.

కమిటీ పైనా అక్కసే..!

మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లను వేగంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో అధికారులు, కార్పొరేటర్లతో కమిటీ వేశారు. ప్రజాప్రతినిధులతో కమిటీ వేస్తే అదేదో అసాంఘిక చర్యగా ఎల్లో మీడియా నానా రాద్ధాంతం చేస్తోంది. స్థల యజమానులకు అధికారులకు, కార్పొరేటర్లు వారధిగా పనిచేయడంతోనే రోడ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్నాయి. అయితే ఈ కమిటీకి సైతం రాజకీయ రంగు పులిమారు. అలాగే రోడ్లు నిర్మిస్తున్న వార్డుల పరిధిలోని ప్లానింగ్‌ సెక్రటరీలకు విధుల కేటాయించడాన్ని తప్పు పట్టడం ఆ పత్రికలే సాధ్యమైంది. సర్వే, ప్లానింగ్‌ పనులను సంబంధిత సెక్రటరీలు పర్యవేక్షించడం వారి విధుల్లో భాగమనే విషయాన్ని విస్మరించిన పచ్చ పత్రికలు చట్ట విరుద్దం అన్నట్టు పిచ్చిరాతలు రాయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు రెట్లు ఇవ్వాల్సిందే..

ప్రభుత్వ నిబంధనలు, జీఓ ప్రకారం రోడ్లు అభివృద్ధి చేసే క్రమంలో అక్కడి పరిస్థితుల మేరకు అగ్రికల్చర్‌, రెసిడెన్షియల్‌, కమిర్షియల్‌గా భూములకు విభజించి ఆ ప్రకారం యజమానులకు టీడీఆర్‌ బాండ్లతో నష్టపరిహారం చెల్లిస్తారు. కాటన్‌ మిల్లు, రేణిగుంట రోడ్డు ప్రాంతాలు దశాబ్దాల క్రితమే కమర్షియల్‌గా మారిపోయాయి. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లోని భూ యజమానులకు నాలుగు రెట్ల విలువతో టీడీఆర్‌ బాండ్‌లు అందజేశారు. సాధారణంగా వీటిని విక్రయించాల్సి వస్తే ఈ బాండ్‌ విలువలో 35 నుంచి 40 శాతం ధరకు మాత్రమే అమ్మువవుతాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధికి సహకరించిన భూ యజమానులు నష్టపోకుండా విలువను పెంచి ఇవ్వాలని పదేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాలు తెలిసినప్పటికీ ఎల్లోమీడియా మాత్రం బురదజల్లడే అజెండాగా అభివృద్ధికి మోకాలడ్డుతోంది.

నగర నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌కు వంద మీటర్ల నుంచి తూర్పు వైపునకు ఇటీవల వరకు సరైన రహదారులు లేవు. దీంతో ఈ ప్రాంతంలోని వేలాది ఎకరాల భూములు నిరుపయోగంగా ఉండేవి. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, సామవాయి రహదారాలు అందుబాటులోకి రాగే వందలాది భవనాల నిర్మాణం మొదలైంది. ఈ ప్రాంత భూములకు రెక్కలు వచ్చాయి. ఎవరూ ఊహించన స్థాయికి భూములకు విలువ పెరిగింది. ఏటా రిజిస్ట్రేషన్‌ శాఖ ఆయా ప్రాంతాల అభివృద్ధిని అంచనా వేసి భూములకు ధరలను నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో నగర తూర్పు ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ధరలను ఖరారు చేశారు. ధరలు పెంచే అధికారం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు గాని, ఇతర ఏ వ్యవస్థలకు ఉండదన్న విషయాన్ని విస్మరించిన ఎల్లో మీడియా పాలకులపై మళ్లీ విషం కక్కింది.

No comments yet. Be the first to comment!
Add a comment
కాటన్‌మిల్లు సెంటర్‌ వద్ద కొత్తగా నిర్మిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ రహదారి1
1/2

కాటన్‌మిల్లు సెంటర్‌ వద్ద కొత్తగా నిర్మిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ రహదారి

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement