తిరుపతి కూటమిలో ఎవరికి దారి వారిదే! | - | Sakshi
Sakshi News home page

తిరుపతి కూటమిలో ఎవరికి దారి వారిదే!

Published Thu, Jul 11 2024 8:20 AM | Last Updated on Thu, Jul 11 2024 1:48 PM

మీరా.. నేనా!

తిరుపతిలో చిత్తూరు నేతలదే పెత్తనం

ఎమ్మెల్యే చెప్పినట్టు నడుచుకోవాల్సిందే

పార్టీ గెలుపు కోసం కష్టపడింది మేమే

పదవులు జనసేన వారికే కట్టబెట్టాలి

గెలుపు కోసం తామూ పనిచేశామంటున్న టీడీపీ, బీజేపీ

 

సాక్షి, తిరుపతి: అధికారంలోకి వచ్చి నెల కూడా గడవక ముందే కూటమిలో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. తమ మాటే చెల్లుబాటు కావాలని ఎవరికి వారు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరు చెప్పి బంధువులు, చిత్తూరుకు చెందిన వారు తిరుపతిలో పెత్తనం చెలాయిస్తుండడంపై స్థానిక కూటమి నేతలు మండిపడుతున్నారు. తిరుపతికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులా? సుగుణమ్మ, కిరణ్‌రాయలా? లేదా మిగిలిన వారా? అంటూ చిత్తూరు నుంచి నగరంలో తిష్టవేసిన వారు స్థానిక నాయకులను ప్రశ్నిస్తున్నారు. 

దీనికి రెండు రోజుల క్రితం క్లస్టర్‌ సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకుడు కిరణ్‌రాయల్‌ మధ్య జరిగిన వాగ్యుద్ధమే నిదర్శనం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని నాయకులు తిరుపతి అభివృద్ధిపై దృష్టి సారించడానికి బదులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలతో పాటు ఇంటా బయట తమ మాటే చెల్లుబాటు కావాలని ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు. తానే ఎమ్మెల్యేని అంటూ ఎవరికి వారు పెత్తనం చెలాయిస్తున్నారని ఆరణి శ్రీనివాసులు వర్గీయులు చిర్రెత్తిపోతున్నారు! ఆరణి గెలుపు కోసం కష్టపడింది తాము అని, స్థానిక నాయకులను కాదని చిత్తూరు నుంచి దిగుమతి చేసుకున్న వారికి పెత్తనమివ్వడం ఏమిటని తిరుపతికి చెందిన కూటమి నేతలు కస్సుబుస్సుమంటున్నారు.

స్థానిక నాయకులంటే చులకనా?
టీడీపీ, బీజేపీ నేతల సహకారంతో గెలిచిన జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్ని పార్టీలనూ కలుపుకుపోయేందుకు ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. కనీసం ప్రొటోకాల్‌ లిస్ట్‌ కూడా తయారు చేయకుండా, స్థానిక నాయకులెవ్వరినీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా ‘నేనే’ అనే ధోరణిలో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారుల బదిలీలు, ఉద్యోగోన్నతుల కోసం ఎమ్మెల్యేను సిఫార్సుల కోసం ఆశ్రయించడం పరిపాటి. కానీ ఎమ్మెల్యే ఆరణి ఇప్పటివరకు ఏ ఒక్క ఉద్యోగికీ సిఫార్సు లేఖ ఇవ్వకపోగా.. లేఖల కోసం చిత్తూరు నుంచి దిగుమతి చేసుకున్న వారి వద్దకు వెళ్లి కలవండి అని చెప్పి పంపడంపై స్థానిక నాయకుల్లో అసంతృప్తిని రాజేసింది.

అధినాయకులకు ఫిర్యాదుల వెల్లువ
తిరుపతి కూటమి నేతలు ఒకరిపై మరొకరు తమ పార్టీ అధినాయకులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై జనసేనలోనే కొందరు నాయకులు పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేస్తుంటే, తానూ తక్కువేమీ కాదని స్థానిక జనసేన నాయకులపైనా ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల తిరుపతి కార్పొరేషన్‌లో ఎమ్మెల్యేకు బదులు ఆయన అన్న కుమారుడు అధికారిక సమావేశంలో పాల్గొనడం, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అధికారిక కార్యక్రమంలోనూ జనసేన నాయకులు పలువురు హాజరై దిశానిర్దేశం చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని రెండ్రోజుల క్రితం జనసేన నాయకుడు కిరణ్‌రాయల్‌ ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే ఆరణి కూడా కౌంటర్‌ ఇవ్వడంతో తిరుపతి కూటమిలో విభేదాలు బట్టబయలయ్యాయి. ఎన్నికల ముందు నుంచి ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

నామినేటెడ్‌ పదవులు కోసం పైరవీలు
కూటమి అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాకమునుపే తిరుపతిలో నామినేటెడ్‌ పదవుల కోసం పలువురు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. వాస్తవంగా పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారిని సిఫార్సు చేయకపోవడంపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక లాభం లేదని వారంతా ఎవరికి వారే పైరవీలు మొదలుపెట్టారు. తుడా చైర్మన్‌ , టీటీడీ పాలక మండలి సభ్యుల పదవిని ఆశిస్తున్న కిరణ్‌ రాయల్‌ వైఎస్సార్‌సీపీ నేతలను విమర్శిస్తే పదవి దక్కుతుందని ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ విమర్శలకు సంబంధించి ఎక్కడా స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తుండటంపై ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరో వైపు డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, కీర్తన, తదితరులు పార్టీలో తమకున్న పరపతిని ఉపయోగించుకుని పదవుల కోసం సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో టీడీపీ నేతలు గ్రూపులు కట్టడంపై ఎమ్మెల్యే ఆరణి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఒకరిద్దరు నాయకులు తిరుమల కొండపై తట్టలు పెట్టించడం, టీటీడీలో రెవెన్యూ పంచాయతీలో సిఫార్సులు చేయడం, ఒకరు చంద్రబాబు వద్ద మరొకరు నారా లోకేష్‌ వద్ద తమకు మంచి పలుకుబడి ఉందని అధికారుల వద్ద ప్రగల్భాలు పలుకుతూ తమ సొంత పనులను చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement