చెత్త తొలగింపునకు చర్యలు
క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వండి
బిజీగా ఉన్నాం.. అంటే కుదరదు!
● రైతులతో గౌరవంగా నడుచుకోండి ● శిక్షణ కార్యక్రమంలో డీఏఓ
తిరుమల: తిరుమలలో 30 ఏళ్లుగా పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు టీటీడీ ఈఓ జే.శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆయన అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాను దిబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం ఈఓ మీడియాతో మాట్లాడుతూ పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టామని, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. మూడు, నాలుగు నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామన్నారు. తడి చెత్త కూడా వేల టన్నులు ఉందని, ఐఓసీఎల్ బయో గ్యాస్ ప్లాంటు అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20వేల టన్నుల కంపోస్టు తయారు చేశామన్నారు. అనంతరం పాపవినాశనం చేరుకున్న ఈవో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాపవినాశనం టోల్ గేట్ వద్ద జారీచేసే టోల్ రశీదులను తనిఖీ చేశారు. ఆకాశగంగ మెట్ల మార్గంలో ఆక్రమణలను తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో టీటీడీ సీఈ సత్యనారాయణ, ఈఈ సుధాకర్, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ సీఎఫ్ శ్రీనివాస్, డిప్యూటీ ఈఓ ఆశాజ్యోతి, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.
కోట: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్‌ఐఓ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాల క్రీడామైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాల జోనల్ క్రీడాపోటీలు శుక్రవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. డీవైఈఓ మధుబాబు, నెల్లూరు డీసీఓ జయలక్ష్మి, ఎంఈఓ మస్తానయ్య, ప్రిన్సిపల్ ఏ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తిరుపతి అర్బన్: ‘మేము ఈ రోజు బిజీగా ఉన్నాం.. తర్వాత రండి’ అంటే కుదరదని డీఏఓ ఎస్.ప్రసాద్‌రావు సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో శుక్ర వారం వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్ సహాయకులకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. డీఏఓ మాట్లాడుతూ కేవలం అన్నదాతల కోసమే గత సర్కార్ ఆర్బీకేలను ఏర్పాటు చేసిన సంగతిని గుర్తుచేశారు. ప్రతి ఉద్యోగి రైతులతో గౌరవంగా నడుచుకోవాలన్నారు. కొందరు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అధికారులు హరిత, సరళ, గాయత్రి పంట ఈ క్రాప్, పంటల బీమా, పీఎం కిసాన్ నమోదుకు సంబంధించిన పలు సూచనలు చేశారు. సూక్ష్మనీటి సేద్య జిల్లా అధికారి సతీష్ మాట్లాడుతూ రైతులను బిందు సేద్యం వైపు మళ్లించే దిశగా పనిచేయాలన్నారు. ప్రాంతీయ వ్యవ సాయ పరిశోధన అధికారి మురళీకృష్ణ రసాయనిక ఎరువుల వాడకం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. జిల్లా వనరుల కేంద్రం ట్రైనింగ్ కో–ఆర్డినేటర్ భాస్కరయ్య, ఏడీఏ లక్ష్మీదేవి, ఏవోలు వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment