వేగవంతంగా సాగరమాల రోడ్డు నిర్మాణం
కోట: సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని విద్యానగర్ వద్ద జరుగుతున్న సాగరమాల ప్యాకేజీ–4 రోడ్డు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. సాగరమాల ప్యాకేజీ–4లో భాగంగా నాయుడుపేట నుంచి తూర్పుకనుపూరు వరకు 35 కిలోమీటర్లు రూ.960 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతోందని, దీనికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వర్షాల కారణంగా పనులు ముందుకు సాగలేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. 90 చోట్ల కల్వర్టులు, వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు. రోడ్డు కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. కోట మండలంలో ఊనుగుంటపాళెం, కొత్తపాళెం, అగ్రహారం గ్రామాల్లో రైతులకు ఇంకా నష్టపరిహారం చెల్లించలేదని దీంతో వారు పనులను అడ్డుకునే అవకాశం ఉందని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా గ్రామసభలు నిర్వహించి భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్రమీనా, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, డీఈఈ చంద్రశేఖర్, కోట, ఓజిలి తహసీల్దార్లు జయజయరావు, పద్మావతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment