అభివృద్ధికి అందలం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి అందలం

Published Mon, Dec 30 2024 7:15 AM | Last Updated on Mon, Dec 30 2024 12:13 PM

కొడంగల్ - నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు

కొడంగల్ - నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు

టాప్‌గేర్‌లో ప్రగతి

జిల్లాకు కలిసొచ్చిన ముఖ్యమంత్రి పదవి

కొడంగల్‌ అభివృద్ధికి రూ.5వేల కోట్లు

పరిగిలో నేవీ రాడార్‌.. వికారాబాద్‌లో స్వదేశీ దర్శిని

తాండూరులో రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు

వికారాబాద్‌: జిల్లా అభివృద్ధికి నేతలంతా కలిసికట్టుగా బాటలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి జిల్లా వాసి కావడంతో మరింత కలిసి వస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ముందుగా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ కోసం కడా(కొడంగల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. అభివృద్ధి సీఎం సొంత నియోజకవర్గానికే పరిమితమా అనే విమర్శలు రావడంతో వెంటనే స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో పాటు జిల్లాకు చెందిన మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రికి విన్నవించడంతో రూ.వందల కోట్ల నిధులతో పనులు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు దారులు సుగమమం అయ్యాయి.

నిధుల కేటాయింపునకు డిమాండ్‌

ప్రభుత్వం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 586 గ్రామ పంచాయతీలతో వుడా(వికారాబాద్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)ను ఏర్పాటు చేసింది. కాగా జిల్లాకు చెందిన మరో నాలుగు మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడదూరంలోనే నిలిచాయి. మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారయింది. అంతర్గత రోడ్లు, బ్రిడ్జీలు అధ్వానంగా మారాయి. వీటికి నిధులు కేటాయించాలనే డిమాండ్‌ ఉంది. పనుల మంజూరు, శంకుస్థాపనలు చేసి చేతులు దులుపుకోకుండా చిత్తశుద్ధితో పనులు పూర్తి చేసేందుకు నేతలు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కొడంగల్‌ నుంచి తొలి అడుగు

గతానికి భిన్నంగా ఏడాది కాలంలోనే జిల్లా అభివృద్ధికి అడుగులు పడ్డాయి. రూ.5వేల కోట్ల నిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆర్‌అండ్‌బీ, విద్య, వైద్య సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. రూ.2,945 కోట్ల నిధులతో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. దుద్యాలలో ఫార్మాసిటీ ఏర్పాటుకు నిర్ణయించగా ‘లగచర్ల’ఘటనతో మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది పూర్తయితే 15వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయని ప్రజలకు వివరిస్తున్నారు.

రైలు కూతకు ప్రతిపాదనలు

పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరులో వీఎల్‌ఎఫ్‌ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) నేవీ రాడార్‌ స్టేషన్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఇప్పటికే ప్రారంభించారు. పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల మీదుగా నిర్మించనున్న వికారాబాద్‌–కృష్ణా మక్తల్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే ప్రభుత్వం సర్వే పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్వదేశి దర్శిని పేరుతో వికారాబాద్‌లోని అనంతగిరులను పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు ట్రిపుల్‌ఆర్‌ ప్రాజెక్టు జిల్లా మీదుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు సైతం జిల్లా అభివృద్ధికి దోహదం చేయనుంది

విద్య, వైద్యంకు ప్రాధాన్యం

● కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలోని బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌ మండలాలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు అనుమతులు ఇవ్వడంతో పాటు కళాశాల భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7.13 కోట్ల చొప్పున మొత్తం రూ.14.26 కోట్లు మంజూరు అయ్యాయి.

● కొడంగల్‌లో నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు రూ. 46 కోట్లు కేటాయించారు. మెడికల్‌ కళాశాల మంజూరు చేసి ప్రభుత్వం నుంచి రూ.124.50 కోట్లు విడుదల చేశారు.

● పారామెడికల్‌, ఫిజియోథెరపీ కళాశాలలు మంజూరు చేసిన సర్కారు ఇందుకు రూ.27కోట్ల నిధులు మంజూరు చేసింది. కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రిని అభివృద్ధి చేసి 220 పడకల సామర్థ్యంతో టీచింగ్‌ ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు రూ.27 కోట్ల నిధులు కేటాయించారు.

● రూ.2,945 కోట్లతో కొడంగల్‌–నారాయణ్‌పేట ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

● కోస్గి పాలిటెక్నిక్‌ కళాశాలను ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు నిర్ణయించింది. ఇందుకు రూ.30కోట్ల నిధులను వెచ్చించనున్నారు. కోస్గికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేసి ఇందుకు రూ.11 కోట్ల నిధులు విడుదల చేశారు.

● నియోజకవర్గ పరిధిలోని గురుకులాల నూతన భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది.

● నియోజకవర్గ కేంద్రంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణానికి రూ.6కోట్ల నిధులు మంజూరు చేసింది.

● మండలాల్లో రోడ్ల విస్తరణకు రూ.344 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణాలకు రూ.30కోట్లు కేటాయించారు.

● కొడంగల్‌ వేంకటేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి రూ.16 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పటికే ఆయా అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు సైతం పూర్తి చేశారు.

కొడంగల్‌–నారాయణపేట్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు

పరిగిలో వెలుగులకు ఆరు సబ్‌స్టేషన్లు

పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరులో నేవీ రాడార్‌ కేంద్రం ప్రారంభించారు. రూ.3,100 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల మీదుగా నిర్మించనున్న వికారాబాద్‌–కృష్ణా మక్తల్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. రూ.3,600 కోట్ల వ్యవయంతో రైల్వే లైన్‌ నిర్మించనున్నారు.

పరిగి మున్సిపాలిటీలో రోడ్ల నిర్మాణానికి రూ.25కోట్లు మంజూరయ్యాయి. తాగునీటి అవసరాలకు ప్రభుత్వం రూ.16కోట్లు మంజూరు చేసింది. గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం నుంచి రూ.23 కోట్ల నిధులు కేటాయించారు.

నియోజకవర్గంలోని తండాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 కోట్లు, రూ.10కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధులతో పనులు పూర్తిచేశారు.

పరిగి–లాల్‌ పహాడ్‌, గడిసింగాపూర్‌–రంగారెడ్డిపల్లి బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.50కోట్లు, రూ.80కోట్లు నిధులు మంజూరయ్యాయి.

జూపర్‌పల్లి సమీపంలో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పార్కుకు రూ.4 కోట్లు, పరిగి–నస్కల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.7కోట్లు, నియోజకవర్గ పరిధిలో ఆరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి రూ.8 కోట్లు నిధులు మంజూరయ్యాయి.

పరిగి–షాద్‌నగర్‌ వరకు నాలుగు వలసల రోడ్డు నిర్మాణానికి రూ.100కోట్ల వ్యయంతో ప్రభుత్వానికి నివేదిక అందజేశారు

వికారాబాద్‌ నియోజకవర్గానికి రూ.899 కోట్లు

వికారాబాద్‌ నియోజకవర్గంలో గడిచిన ఏడాదిలో రూ.889 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.

వికారాబాద్‌ మండలంలో రూ.212.21 కోట్లతో అభివృద్ధి పనులు

ధారూర్‌ మండలంలో అభివృద్ధి పనులకు రూ.115.15 కోట్లు

మోమిన్‌పేట్‌ గడిచిన ఏడాదిలో రూ.44.56 కోట్లతో అభివృద్ధి పనులు.

మర్పపల్లి మండల పరిధిలో రూ.104.16 కోట్లతో అభివృద్ధి పనులు

కోట్‌పల్లి మండలంలో రూ.142.70 కోట్లతో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు.

బంట్వారం మండలంలో అభివృద్ధి పనులకు రూ.269.49 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టారు.

తాండూరులో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట

బషీరాబాద్‌–కరన్‌కోట్‌ వరకు 12 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు

మహబూబ్‌నగర్‌ చించోలి రహదారిలో భాగంగా తాండూరు పట్టణంలో 4 కిలోమీటర్ల డబుల్‌ లైన్‌, ఫోర్‌లైన్‌ రోడ్డు విస్తరణ మైనర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.35 కోట్లు

తాండూరు–వికారాబాద్‌ 39 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.101 కోట్లు

నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి సీపీఆర్‌ గ్రాంట్స్‌ నుంచి రూ.5కోట్లు

టెండర్ల ప్రక్రియలో రహదారులకు రూ.56.8కోట్లు

తాండూరులో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.150 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement