సెలవుల్లోనూ సై అన్నారు!
సాక్షి, సిటీబ్యూరో: పండగ సమయంలోనూ జలమండలి యంత్రాంగం రాత్రింబవళ్లు శ్రమించి నగరంలోని పలు ప్రాంతాల్లో పైపు లైన్ల మరమ్మతు పనులు చక్కబెట్టింది. సంక్రాంతి సెలవులతో కొన్ని శాఖల ఉద్యోగులు కుటుంబ సమేతంగా ఊరెళ్లగా.. మరికొందరు ఇంటి పట్టునే ఉండగా.. జలమండలి ఉన్నతాధికారులు, సిబ్బంది మాత్రం తాగునీటి, డ్రైనే జీ పైపులైన్ల మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. సాధారణ రోజుల్లో రద్దీగా ఉండే నగరంలోని ప్రధాన రహదారులపై సంక్రాంతి పండగ సెలవులతో వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. దీంతో జలమండలి సిబ్బంది ముందస్తు ప్రణాళికతో పైపులైన్ లీకేజీలు, పైపులైన్ల మార్పిడి పనులు చేపట్టి పలు సమస్యలను పరిష్కరించారు. నగరంలో కేపీహెచ్‌బీ, అమీర్‌పేట, పంజాగుట్ట, మూసాపేట్, బంజారాహిల్స్, జగద్గిరిగుట్ట, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఏర్పడ్డ లీకేజీలు, సీవరేజ్, ఇతర సమస్యలను రాత్రి, పగలు తేడా లేకుండా పని చేశారు.
పనులు ఇలా..
రెండు రోజుల పాటు రాత్రి సమయాల్లోనూ రోడ్ క్రాసింగ్ పనులు నిర్వహించారు. మూసాపేట, కేపీహెచ్‌బీ పరిధిలోని ఫోరం మాల్ సర్కిల్ దగ్గర సీవరేజీ పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టారు. మూసాపేట్‌లోని ఆంజనేయనగర్ లో సీవరేజీ పైపులైన నిర్మాణ పనులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–10 లో ఏర్పడిన లీకేజీని అరికట్టారు. జగద్గిరిగుట్ట ఇందిరాగాంధీ విగ్రహం వద్ద లీకేజీని కట్టడి చేశారు. ప్రగతి నగర్‌లో నీటి సరఫరా పెంచడానికి గ్యాప్ క్లోజ ర్ పనులు నిర్వహించారు. పంజాగుట్ట క్రాస్ రోడ్స్‌లో సీవరేజ్ పైపులైన్ డ్యామేజీ కావడంతో దానికి మరమ్మతులు నిర్వహించారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ప్రధాన రహదారులపై చేపట్టిన పనులు సంబంధిత సర్కిళ్ల జీఎంలు, సెక్షన్ల మేనేజర్లు పరిశీలించారు. నగరంలోని రోడ్లు ఖాళీగా ఉండటం పనులకు మరింత కలిసి వచ్చినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment