![పరిషత్తు.. కసరత్తు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04vkb01-360030_mr-1738718091-0.jpg.webp?itok=9kE_aNrh)
పరిషత్తు.. కసరత్తు
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సన్నద్ధం
● పార్టీ గుర్తుపై వెళ్లేందుకే మొగ్గు ● జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ● పోటీకి సమాయత్తమవుతున్న ఆశావహులు ● ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం
వికారాబాద్: మళ్లీ ఎన్నికల కాలం మొదలవబోతోంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో అన్నింటికంటే ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగియగా ప్రభుత్వం వాటికి కాకుండా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ గుర్తుతో నిర్వహించే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉండాలనే దానిపై అధికారులు ఓ అంచనాకు వచ్చారు. కొత్తగా ఏర్పాటైన మండలాలు, పక్క మండలాల నుంచి కలిసిన గ్రామాలు, మండలాల నుంచి మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాలను పరిగణలోకి తీసుకుని మండలాల వారీగా ఎంపీటీసీల సంఖ్యను నిర్ణయించారు. ఈ లెక్కలు మంగళవారం పంచాయతీరాజ్ కమిషనర్‌కు అందజేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రత్యేక పాలన
గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగియగా ఫిబ్రవరి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే జీపీ ఎన్నికలు పూర్తి కావాల్సి ఉన్నా ప్రభుత్వం అనివార్యకారణాలతో వాయిదా వేసింది. జిల్లాలో మొత్తం 221 మంది ఎంపీటీసీలు ఉండగా వారి పదవీ కాలం గతేడాది జూలై 3వ తేదీతో ముగిసింది. 18 మంది జెడ్పీటీసీలు ఉండగా వారి పదవీ కాలం కూడా ఒక్కరోజు తేడాతో అంటే జూలై 4తో ముగిసింది. వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులకు కేటాయించారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో దేనికీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాలేదు. గతంలో జీపీ ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని, బీసీ కమిషన్ నివేదికతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ షెడ్యూల్ విడుదల చేయడంతో.. ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అయితే అది కాస్త పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా పరిషత్ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మండల, పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలపై పడింది. ఈ నేపథ్యంలో ఇక వరుస ఎన్నికలు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
కొత్త మండలాల్లో..
జిల్లాలో 2019 ఎన్నికల్లో 18 మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన చౌడాపూర్, దుద్యాల్ మండలాల్లో కూడా ఈ సారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మండల పరిషత్‌ల సంఖ్య 18 నుంచి 20కి చేరింది. గతంలో 221 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 227కు చేరింది. ప్రస్తుతం మన జిల్లా పరిధిలోని బొంరాస్‌పేట.. నారాయణపేట్ జిల్లా పరిధిలోని కోస్గి మండలం నుంచి కొన్ని కొన్ని గ్రామాలను తీసుకుని దుద్యాలను కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. కుల్కచర్ల మండలానికి చెందిన కొన్ని గ్రామాలు.. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో కలిసిన మరి కొన్ని గ్రామాలతో మరో కొత్త మండలం చౌడాపూర్‌ను ఏర్పాటు చేశారు. పరిగి మండలం నుంచి కొన్ని గ్రామాలు పరిగి మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటికీ నవాబుపేట.. కోస్గి మండలాల నుంచి కొన్ని గ్రామాలు మన జిల్లాలో కలవటంతో ఎంపీటీసీల సంఖ్య పెరిగింది. అంటే ఈ సారి కొత్తగా ఏర్పాటైన రెండు మండలాల్లో ఆరు ఎంపీటీసీ స్థానాలు, రెండు జెడ్పీటీసీ స్థానాలు, రెండు ఎంపీపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment