హామీలు అమలు చేయాల్సిందే
కొడంగల్: ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. జనవరి 26న కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి నాలుగు పథకాలను ప్రారంభించారని గుర్తు చేశారు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి రైతుల ఖాతాల్లో టకీ టకీ మంటూ డబ్బులు పడతాయని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అంతలోనే మార్చి 31న రైతు భరోసా చెల్లిస్తామని మాట మార్చారని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.15వేలు చెల్లించాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 10న కోస్గిలో రైతు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వస్తారని చెప్పారు. ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, నాయకులు మధు యాదవ్, విష్ణువర్ధన్‌రెడ్డి, ముదిగండ్ల కృష్ణ, భీములు, యాదగిరి, ఎరన్‌పల్లి శ్రీనివాస్, మహిపాల్, మున్నూరు బిచ్చప్ప, మధుసూదన్‌రెడ్డి, శేరి నారాయణరెడ్డి, నర్మద కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
రానున్న రోజులు మనవే
దౌల్తాబాద్: బీఆర్‌ఎస్ కార్యకర్తలు అధైర్యపడరాదని.. రానున్న రోజులు మనవేనని.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుండేపల్లి, దౌల్తాబాద్ గ్రామాలకు చెందిన వారిని బుధవారం పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మహిపాల్‌రెడ్డి, రమేష్, భీంరెడ్డి, మల్కప్ప తదితరులు పాల్గొన్నారు.
10న కోస్గిలో రైతు నిరసన దీక్ష
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment