యాలాల: కాంగ్రెస్ మండల అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న సంగెం నర్సిరెడ్డి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మండల అధ్యక్షుడి వ్యవహారం కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చకు దారి తీస్తోంది. అధికార పార్టీ మండల అధ్యక్ష బాధ్యత వహిస్తున్న నాయకుడు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి విషయంలో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. నాయకుల మధ్య వారధిగా ఉండాలి. ఇవేవి యాలాల మండలంలో కనిపించడం లేదని చర్చ సాగుతోంది. రెండు రోజుల క్రితం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల మండల అధ్యక్షులతో అధికారులు సమాశం నిర్వహించారు. దీనికి కూడా ఆయన హాజరుకాలేదు. ఈ విషయాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుబట్టారు. వీటితో పాటు బీసీ రిజర్వేషన్ అమలు తీర్మానం విజయవంతం కావడంతో టీపీసీసీ బుధవారం మండల కేంద్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాలని మండల పార్టీకి సూచించింది. ఈ కార్యక్రమానికి సైతం నర్సిరెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో చేసేదేమీలేక కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూతూ మంత్రంగా ముగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అధిక మెజారిటీ..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి 5వేల పైచిలుకు మెజార్టీని అందించి, ఆయన గెలుపులో యాలాల మండలం కీలకంగా వ్యవహరించింది. 30 ఏళ్ల వ్యవధిలో యాలాల మండలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులకు దక్కని మెజార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి దక్కింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే స్వయంగా పలుమార్లు సభలు, సమావేశాల్లో సైతం వ్యక్తపరిచారు. కాగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని క్షేత్రస్థాయిలోకి పూర్తిగా తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాంది పలికాలని అధిష్టానం భావిస్తుంటే, యాలాల మండలంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఎమ్మెల్యే పర్యటన ఉంటే కనిపించే నాయకులు, ప్రభుత్వ పథకాల అమలు, ఆయాకార్యక్రమాల విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరించడం తగదని పేర్కొంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా సాగుతున్న నర్సిరెడ్డి, ప్రస్తుతం తాండూరు ఏఎంసీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు.
చర్చనీయాంశంగా కాంగ్రెస్ యాలాల మండల అధ్యక్షుడి వైఖరి
నర్సిరెడ్డి తీరును తప్పుపడుతున్న
స్వపక్ష, విపక్షాలు
Comments
Please login to add a commentAdd a comment