మనోడు కాదా.. వీఆర్‌లో ఉంచేయ్‌..! | - | Sakshi
Sakshi News home page

మనోడు కాదా.. వీఆర్‌లో ఉంచేయ్‌..!

Published Fri, Sep 20 2024 2:42 AM | Last Updated on Fri, Sep 20 2024 2:42 AM

మనోడు కాదా.. వీఆర్‌లో ఉంచేయ్‌..!

● రేంజ్‌ వీఆర్‌లో 57 మంది సీఐలు ● ఈ నెల 1 నుంచి 14వ తేదీ మధ్యే 24 మంది వీఆర్‌కు.. ● పోస్టింగ్‌ల కోసం మూడు నెలలుగా ఎదురుచూపులు ● సిఫార్సు లేఖల కోసం రూ.లక్షలు వసూలు ● స్థానాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బేరం

విశాఖ సిటీ: పోలీస్‌ శాఖలో బదిలీల ప్రక్రియ కూటమి ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇన్‌స్పెక్టర్‌ నుంచి ఆ కింది స్థాయి పోస్టింగ్‌లు ఎమ్మెల్యేలకు వరంగా మారాయి. స్టేషన్‌కు ఓ రేటును ఫిక్స్‌ చేసి సిఫార్సు లేఖలు మంజూరు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా లేని వారిని మాత్రం వీఆర్‌లోనే ఉంచేలా పోలీస్‌ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో విశాఖ రేంజ్‌ వీఆర్‌లో ప్రస్తుతం 57 మంది ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరిలో కొందరు గత మూడు నెలలుగా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. కొంత మందిని కక్షపూరితంగా.. మరికొంత మంది నుంచి బేరం కుదరకపోవడంతో వీఆర్‌కే పరిమితమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ముందు సిగపట్లు.. తరువాత సర్దుబాట్లు

ఐపీఎస్‌ల నుంచి ఏసీపీ వరకు నియామకాలు చినబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. కానీ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆ కింది స్థాయి సిబ్బంది విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల సిఫార్సులు ఉంటేనే ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు లభిస్తున్నాయన్న టాక్‌ నడుస్తోంది. దీంతో అనేక మంది సీఐలు ఇప్పటికే ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభంలో టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయి. బదిలీల విషయంలో తమ మాట చెల్లలేదని జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్‌, పంచకర్ల రమేష్‌బాబు, సుందరపు విజయ్‌కుమార్‌లు అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత మాత్రం అందరూ చక్కగా సర్దుకున్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారిదే పెత్తనం సాగాలన్న ఒప్పందానికి వచ్చారు. అలాగే ఎంపీకి మాత్రం ప్రతి నియోజకవర్గంలో ఒక పోస్టింగ్‌కు అవకాశం కల్పించాలన్న అవగాహన కుదుర్చుకున్నారు.

స్టేషన్‌కో రేటు

కొంత మంది ఎమ్మెల్యేలు స్టేషన్‌కు ఒక రేటును ఫిక్స్‌ చేశారు. దీని ప్రకారం సిఫార్సు లేఖలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ఇచ్చిన వారికి నచ్చిన పోస్టింగ్‌లు వరిస్తున్నాయి. కొంత మంది సీఐలపై మాత్రం కొందరు ఎమ్మెల్యేలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. తమకు అనుకూలంగా లేరన్న నెపంతో సిటీ నుంచి కొందరిని రేంజ్‌ వీఆర్‌కు పంపించేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా అక్కడి స్థానిక ఎమ్మెల్యేలు ఇదే తరహాలో వ్యవహరించారు. దీంతో వీఆర్‌లో ఉన్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం వీఆర్‌లో 57 మంది ఉండగా.. ఇందులో ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 24 మంది వీఆర్‌కు వచ్చారు. జిల్లాల్లో సీఐల స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. వీరికి పోస్టింగ్‌లు మాత్రమే ఇవ్వడం లేదు. అలాగే జూన్‌ నుంచి కూడా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న వారూ ఉన్నారు. అయినప్పటికీ.. కూటమి నేతలు వారిపై కనికరం చూపించడం లేదు. వారిని తమ దారిలోకి తెచ్చుకోవడానికే ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement