ప్రహసనంగా ‘స్థాయీ’ సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

ప్రహసనంగా ‘స్థాయీ’ సమావేశాలు

Published Sat, Sep 21 2024 2:16 AM | Last Updated on Sat, Sep 21 2024 2:16 AM

ప్రహసనంగా ‘స్థాయీ’ సమావేశాలు

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ స్థాయీ సంఘం సమావేశాలు గాడి తప్పుతున్నాయి. ఆమోదం పొందిన అంశాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ స్థాయీ సంఘ సభ్యులకు అనుకూలంగా ఉన్న కొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం తెలుపుతుండగా..చాలా అంశాలు వాయిదా వేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో స్థాయీ సంఘం సమావేశం ఓ లెక్క..కూటమి ప్రభుత్వం వచ్చాక మరో లెక్క అన్న మాదిరిగా మారిపోయింది. గత ప్రభుత్వ హయాంలో అంతా పారదర్శకంగా సమావేశాలు జరగ్గా..కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి పనికీ ఎంతోకొంత ప్రతిఫలం లేనిదే పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దాదాపు ఆరేడు నెలల తర్వాత ఈ నెల 13న నూతన సభ్యులతో సంఘ సమావేశం నిర్వహించారు. 280 అజెండా అంశాలకు గాను 150 వరకు చర్చించారు. వాటిలో 50 అంశాలు వాయిదా వేశారు. ఈ నెల 17న మిగిలిన అజెండా అంశాలకు సంబంధించి మరో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో 6 అంశాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కట్‌ చేస్తే..తాజాగా శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం స్థాయీ సంఘ చైర్మన్‌ గొలగాని హరి వెంకటకుమారి అధ్యక్షతన నిర్వహించారు. గత రెండు స్థాయీ సమావేశాల్లో వాయిదా పడ్డ 56 అంశాలతో పాటు మరో 68 అంశాలు జోడించి మొత్తంగా 124 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు తీసుకొచ్చారు. వీటిలో 2 అంశాలు(34, 35 అంశాలు) తిరస్కరించగా ఏకంగా 63 అంశాలను సభ్యులు వాయిదా వేశారు. అయితే ఈ అంశాలకు సంబంధించి కార్పొరేటర్లకు సంబంధిత పనులు నిర్వహించే కాంట్రాక్టర్లకు మధ్య డీల్‌ కుదరకపోవడమే కారణమని తెలుస్తోంది. 59 అంశాలు పరిపాలన, కార్మికుల జీతాలకు సంబంధించిన అంశాలు ఆమోదించారు.

వాయిదా అంశాలివే..

● జీవీఎంసీ మెకానికల్‌ విభాగానికి సంబంధించి ఆపరేషన్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌ పద్ధతి ద్వారా కాంపాక్టర్‌ వాహనాలను చెత్త తరలించేందుకు పలు జోన్లలో వినియోగించే విషయమై సభ్యుల ఆమోదానికి చర్చకు వచ్చింది.

● జోన్‌–2 పరిధి ఆరో వార్డులో డాక్టర్‌ వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న దృష్ట్యా ఉచిత తాగునీటి సరఫరా, టీ షర్టులు, గ్లాసులు తదితర వాటికి ఖర్చు అంశాన్ని సభ్యులు వాయిదా వేశారు.

ఆమోదం..

మెకానికల్‌ విభాగానికి సంబంధించి ప్రజారోగ్య శాఖ శానిటేషన్‌ వాహనాలు సుమారు 400 వాహనాలు(అన్ని జోన్లు కలిపి) మరమ్మతుల చేపట్టే విషయమై వచ్చే అంశాలన్నీ సభ్యులు ఆమోదించారు. ఈ అంశాలను కూడా ఓ పక్షాన సభ్యులు వాయిదా వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతి నెలా మరమ్మతులు చేపట్టే కన్నా..కొత్త వాహనాలు కొనుగోలు చేయ్యోచ్చు కదా..అని పలువురు సభ్యులు అడగ్గా..స్థాయీ సంఘ చైర్మన్‌ గొలగాని హరి వెంకటకుమారి జోక్యం చేసుకుని ఇవన్నీ 15వ సంఘ ఆర్థిక నిధులు..అంతకన్నా ముందువని, నేరుగా వాహనాలు కొనుగోలు చేసే అధికారం మనకు లేదని, 16వ ఆర్థిక సంఘ నిధులు వస్తే కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

ఏ అంశమైనా కార్పొరేటర్‌కు తెలపండి

వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులే గాక ఏ పని చేపట్టినా స్థానిక కార్పొరేటర్లకు చెప్పాలని సభ్యులు కోరారు. ప్రతి విషయంలో కార్పొరేటర్‌ను భాగస్వామ్యం చేయాలని చైర్మన్‌ ద్వారా అధికారులకు తెలిపారు.

ఆమోదం పొందిన అంశాలపై విమర్శలు

తమకు అనుకూలంగా లేని

అంశాలు వాయిదా

బయటపడ్డ విభేదాలు

స్థాయీ సంఘం సభ్యుల్లో లుకలుకలు బయటపడ్డాయి. జోన్‌–8 చీమలాపల్లి వద్ద గల సీసీఎస్‌ ప్రాజెక్టు నిర్వహించే విషయమై పరిపాలన పరమైన ఆమోదానికి సభ్యుల ముందుకు చర్చకు వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌ పద్ధతిలో సభ్యుల ఆమోదానికి చర్చకు రాగా..ఆ విభాగానికి సంబంధించిన అధికారి వివరణ ఇస్తూ..స్థాయీ సభ్యుల్లో నలుగురు ఈ విషయమై స్టడీ చేస్తామని, తామే వచ్చి పరిశీలిస్తామని చెప్పారన్నారు.

ఈ విషయంలో ఆ నలుగురే సభ్యులా? మిగిలిన వారు కదా అంటూ స్థాయీ సంఘ సభ్యుడొకరు అధికారులను నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement