మధురవాడ: ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కార్‌షెడ్ జంక్షన్ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో డోని సావిత్రి (80) అనే వృద్ధురాలు మృతి చెందింది. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాలివి.. ఐఏఆర్‌ఎంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బుజ్జి.. భార్య, తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో భీమునిపట్నం ఎగువపేటలో నివసిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం బుజ్జి భార్య రాజేశ్వరి, సోదరుడు మధు, తల్లి సావిత్రితో కలిసి బక్కన్నపాలెంలో ఉంటున్న బంధువుల ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో భీమిలిలో ఆర్టీసీ బస్సు ఎక్కి మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి కార్‌షెడ్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. సిగ్నల్ వద్ద ముందుగా బుజ్జి ఆయన భార్య, సోదరుడు బస్ దిగారు. సావిత్రి బస్ దిగుతున్న క్రమంలో డ్రైవర్ బస్సు నడపడంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. ఆమె కాళ్లపై నుంచి బస్సు వెళ్లిపోవడంతో తీవ్రంగా రక్త స్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు బుజ్జి ఫిర్యాదు మేరకు పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment