అర్జీల రీ ఓపెన్‌పై ఆగ్రహం
పింఛను కోసం దివ్యాంగురాలి వేదన
మహారాణిపేట: సరిగా నిలబడలేదు..నోరు విప్పి మాట్లాడలేదు..చివరికి ఆహారం కూడా తినలేని పరిస్థితి. జన్యు పరమైన సమస్యతో ఆమె మానసిక దివ్యాంగురాలిగా జీవనం గడుపుతోంది. పైళ్లె..ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమె మానసిక పరిస్థితి చూసి భర్త విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె తల్లి చేరదీసింది. మానసిక దివ్యాంగురాలైన తన బిడ్డకు పింఛను ఇప్పించండి మహాప్రభో అంటూ కాళ్లరిగేలా తిరుగుతోంది. గోపాలపట్నం ఆర్.ఆర్.వెంకటాపురం నందమూరినగర్‌లో ఉంటున్న మద్ది సత్యవతి..మానసిక దివ్యాంగురాలు. ప్రస్తుతం తల్లి కొయ్యన రమణమ్మ దగ్గర తన ఇద్దరి పిల్లలతో ఉంటుంది. రమణమ్మకు వచ్చే పింఛన్‌తోనే వీరు జీవిస్తున్నారు. మానసిక దివ్యాంగురాలైన తన కుమార్తెకు వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్‌తోపాటు, సదరం సర్టిఫికెట్ కూడా ఉందని, పింఛను మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించేందుకు సత్యవతి, ఆమె పిల్లలను వెంటబెట్టుకుని రమణమ్మ కలెక్టరేట్‌కు వచ్చింది. పింఛను ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంది.
మహారాణిపేట: జిల్లాలో 165 రీ ఓపెన్ అర్జీలు రావడంతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి కచ్చితమైన సమాచారాన్ని అందించి, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీ పునరావృతమైతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు జేసీ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీటిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 237 వినతులు అందగా..రెవెన్యూ శాఖకు చెందినవి 76, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీకి సంబంధించి 65 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 81 వినతులు వచ్చాయి.
అధికారులకు కలెక్టర్ అభినందన
జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటన, సౌత్ జోన్–2 జ్యుడీషియల్ కాన్ఫరెన్స్‌లను నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ హరేందిర ప్రసాద్ అభినందించారు.
పీజీఆర్‌ఎస్‌కు 237 అర్జీలు
సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment