ఐఎంయూ వద్ద కొనసాగుతున్న నిర్వాసితుల ఆందోళన
సబ్బవరం: మండలంలోని వంగలి గ్రామంలో ఉన్న ఇండియన్ మారిటైం విశ్వవిద్యాలయంలో స్థానికులకు, భూ నిర్వాసిత రైతులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం మూడో రోజు సోమవారం కొనసాగింది. భూ నిర్వాసిత రైతులు, వంగలి గ్రామస్తులు తమ డిమాండ్లకు సాధనకు విశ్వవిద్యాలయం ఎదుట శనివారం ధర్నా, రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆందోళనకారులకు, యాజమాన్యం మధ్య చర్చలు విఫలమవడంతో నిరసన కొనసాగిస్తున్నారు. మూడోరోజు సోమవారం రైతులు, గ్రామస్తులు సుమారు 500 మంది వరకూ దీక్ష స్థలికి చేరుకొన్నారు. యథావిధిగా దీక్షను కొనసాగిస్తుండడంతో విశ్వవిద్యాలయంలో కార్యకలాపాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇదిలావుండగా పెందుర్తిలోని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సమక్షంలో గ్రామస్తులు, విశ్వవిద్యాలయం ప్రతినిధులతో చర్చలు జరిగాయని ప్రచారం జరుగుతోంది. కొన్ని డిమాండ్లను అంగీకరించినప్పటకీ లిఖిత పూర్వకంగా హామీ లభించకపోవడంతో ఆందోళన కొనసాగించేందుకు గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. రైతులు పెద్ద ఎత్తున ప్లకార్డులతో నినాదాలు చేశారు. మూడో రోజు ఆందోళనలో సర్పంచ్ ఆకుల శ్రీహేమతోపాటు నాయకులు ఆకుల గణేష్, జెట్టి ప్రసాద్, జెట్టి ముత్యాలనాయుడు, గొర్లి అప్పలనాయుడు, జెట్టి శ్రీను,జెట్టి నరసింగరరావు,గవర అప్పలనాయుడు,ముమ్మణ అప్పలరాజు,యర్ర సతీష్, గవర గాయిత్రీ, జెట్టి హేమంత్, కోన కొండబాబు, జెట్టి సోమేష్‌తో పాటు భూ నిర్వాసిత రైతులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తహసీల్దార్ చిన్నికృష్ణ, సీఐ రమణ సోమవారం వర్సిటీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులు, నిర్వాసితుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని తహసీల్దార్ చిన్నికృష్ణ తెలిపారు. సీఐ రమణ మాట్లాడుతూ వర్సిటీ వద్ద తనతో పాటు మరో సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ దివ్యతో పాటు 20 మంది వరకూ ఆర్మ్‌డ్ ఫోర్స్, మరో 25 మంది వరకూ సివిల్ ఫోర్స్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment