ప్రజా పరిష్కారవేదికకు 92 వినతులు
డాబాగార్డెన్స్: ప్రజా పరిష్కార వేదికకు 92 వినతులు అందినట్టు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో కమిషనర్ సంపత్ కుమార్‌తో కలిసి అర్జీలను స్వీకరించారు. జోన్–2 నుంచి 12, జోన్–3 నుంచి 13, జోన్–4 నుంచి 11, జోన్–5 నుంచి 16, జోన్–6 నుంచి 10, జోన్–7 నుంచి ఒకటి, జోన్–8 నుంచి 10 ఫిర్యాదులు అందగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సంబంధించి 19 ఫిర్యాదులు అందాయని మేయర్ తెలిపారు. మొత్తం వినతుల్లో పట్టణ ప్రణాళికా విభాగానికి చెందినవే 45 ఉండడం గమనార్హం.
● అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్డు సమీపంలో ప్రధాన గెడ్డ ఉంది. గెడ్డను ఆక్రమించి ఎటువంటి సెట్‌బ్యాక్స్ లేకుండా ఓ వ్యక్తి భవనం నిర్మిస్తున్నాడు. దీనివల్ల వర్షాకాలంలో పెద్ద ఎత్తున దిగువ ఉన్న ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది..దీనిపై చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతానికి చెందిన వెంకటరావు వినతి పత్రం అందజేశాడు.
● మధురవాడ టీచర్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో లే అవుట్ సుమారు 55 ఎకరాలు. ఎల్‌పీ నంబరు 2/85, రివైజ్డ్ నంబరు 70/87. లేఅవుట్‌లో 2 వేల గజాల స్థలాన్ని పార్కింగ్ కోసం విడిచిపెట్టాం. ప్రస్తుతం దానిని వేరే వ్యక్తి కబ్జాకు పాల్పడతున్నాడు. ఈ విషయమై గత నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశా. సిబ్బంది వచ్చి లే అవుట్ ప్లాన్ అడిగారు. చూపించా.. లే అవుట్‌లో కబ్జాకు పాల్పడడమే గాక వేసిన షెడ్డు తొలగించాలని వేడుకుంటే..వచ్చిన సిబ్బంది పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని గత నెల 30న వీఎంఆర్‌డీఏకి ఫిర్యాదు కూడా చేశాను. మాకు న్యాయం చేసి కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మధురవాడ టీచర్స్ కో ఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎస్ విజయ రాఘవన్ వినతిపత్రం అందజేశారు.
● మధురవాడలోని సర్వే నంబరు 281/8,9,10 షిప్‌యార్డ్ లే అవుట్, వుడా లే అవుట్. ఎల్‌పీ నంబరు 24/94 ప్రకారం పార్కుగా గుర్తించారు. ఆ స్థలంలో అనధికారికంగా 2 రేకుల షెడ్డులు వెలిశాయి. వాటిని తొలగించాలని పలు మార్లు వినతి పత్రం అందజేశాం. వీఎంఆర్‌డీఏలో కూడా ఫిర్యాదు చేశాం. మా వినతిపై మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయి విచారణ చేపట్టారు. ఆ స్థలం పార్కుదని తేల్చారు. అయినప్పటికీ జీవీఎంసీ జోన్–2 అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ ప్రాంత వాసి సాగర్ అర్జీ సమర్పించాడు.
Comments
Please login to add a commentAdd a comment