ఫిట్‌నెస్‌లో అన్నీ ఫిట్టింగులే..!
జీవీఎంసీ వాహనాల ఫిట్‌నెస్ ట్యాక్స్‌లో గోల్‌మాల్
● వాహనాలు మరమ్మతుకు రావడంతో బండారం బట్టబయలు ● జీవీఎంసీ ఖజానాకు రూ.50 లక్షల కన్నం ● నిధుల మళ్లింపులో డీఈ దిలీప్ కీలక సూత్రధారి ● కూటమి నేతల ఒత్తిళ్లతో షోకాజులతో సరి ● పైగా జోన్–1 ఈఈగా పదోన్నతి.. కాపులుప్పాడలో కొత్త పోస్టు ● కలర్ జిరాక్సులతో రోడ్ ట్యాక్స్ నిధులూ మళ్లింపు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :
జీవీఎంసీ వాహనాల ఫిట్‌నెస్ ట్యాక్స్ చెల్లింపులో గోల్‌మాల్ జరిగింది. ఈ నిధులను పక్కదారి పట్టించారు. ఇందులో సంబంధిత ఏజెన్సీతోపాటు జీవీఎంసీలో మెకానికల్ సెక్షన్ డీఈ దిలీప్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొత్తం 430 వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం రూ.70 లక్షల మేర జీవీఎంసీ నుంచి ఏజెన్సీకి చెల్లించగా.. కేవలం రూ.30 లక్షల మేర మాత్రమే ట్యాక్స్ చెల్లించి మిగిలిన మొత్తాన్ని మళ్లించేశారు. గత ఏడాది జీవీఎంసీకి చెందిన ఆరు వాహనాలు మరమ్మతుకు గురయ్యాయి. ఈ వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించదంటూ బీమా కంపెనీ తేల్చిచెప్పింది. దీంతో బాగోతం బయటపడింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాలకు రూ.50 లక్షల మేర జీవీఎంసీ నిధులతో మరమ్మతులు చేశారు. అంతేకాకుండా రోడ్ ట్యాక్స్ చెల్లింపులోనూ జీవీఎంసీ నుంచి నిధులు బొక్కేసినట్టు తేలింది. దీంతో పెనాల్టీతో కలిపి రోడ్ ట్యాక్స్ జీవీఎంసీ చెల్లించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో కూడా దిలీప్ వైపే వేళ్లన్నీ చూపుతున్నాయి. విచిత్రంగా ఈ నిధుల మళ్లింపులో కేవలం ఏజెన్సీపై మాత్రమే కేసు నమోదు చేసి.. కిందిస్థాయి ఉద్యోగి వర్క్ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకొని.. మెకానికల్ ఈఈగా అప్పట్లో ఉన్న దిలీప్‌ను, సెక్షన్‌ను మాత్రం తప్పించారు. కూటమి నేతల ఒత్తిళ్లతోనే దిలీప్‌పై చర్యలు తీసుకునేందుకు జీవీఎంసీ అధికారులు వెనుకంజ వేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా డీఈ పోస్టును సృష్టించి కాపులుప్పాడకు బదిలీ చేయడంతో పాటు ఏకంగా పదోన్నతి ఇచ్చి జోన్–1 ఇన్‌చార్జి ఈఈగా నియమించడం గమనార్హం.
కలర్ జిరాక్సులతో కలరింగ్
రోడ్ ట్యాక్స్ వ్యవహారంలోనూ కలర్ జిరాక్సులతో కలరింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒక బండికి చలానా చట్టి... అదే చలానా కలర్ జిరాక్స్ తీసి ఇతర వాహనాలకు కూడా రోడ్ ట్యాక్స్ చెల్లించేసినట్టు జీవీఎంసీలో రికార్డులు సృష్టించారు. ఇందుకు అనుగుణంగా ట్యాక్స్ మొత్తాన్ని జీవీఎంసీ ఖజానా నుంచి సదరు ఏజెన్సీ లాగేసుకుంది. రవాణాశాఖ అధికారుల వద్ద రికార్డుల్లో కొన్ని వాహనాలకు రోడ్ ట్యాక్స్ కట్టినట్టు ఉంది. మిగతా వాహనాలకు రోడ్ ట్యాక్స్‌తోపాటు పెనాల్టీ కూడా చెల్లించాలని రవాణాశాఖ నోటీసులు జారీచేసింది. దీంతో పెనాల్టీలను కలుపుకుని మరీ జీవీఎంసీ ఖజానా నుంచి అధికారులు చెల్లించాల్సి వచ్చింది. అయితే, సదరు ఏజెన్సీతో పాటు ఏమాత్రం సంబంధం లేని కిందిస్థాయి ఉద్యోగి వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను బలిచేశారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు అప్పటివరకు మెకానికల్ సెక్షన్ చూస్తున్న ఇన్‌చార్జి ఈఈ దిలీప్‌కు కేవలం షోకాజ్ నోటీసులతో వ్యవహారం కప్పిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా మెకానికల్ సెక్షన్‌లో అవసరం లేకపోయినప్పటికీ అక్కడే పోస్టును సృష్టించి కాపులుప్పాడ ఇన్‌చార్జి డీఈగా నియమించారు. అంతటితో ఆగకుండా జోన్–1కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా (ఎఫ్‌ఏసీ) కూడా నియమించడంలో కూటమి నేతల ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి.
వాహనాలు ఆగిపోవడంతో..
జీవీఎంసీలో ఆయా డిపార్ట్‌మెంట్‌లకు మొత్తం 430 వాహనాలున్నాయి. ఈ వాహనాలకు ఏటా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫిట్‌నెస్ ట్యాక్స్‌ను నేరుగా జీవీఎంసీ కాకుండా ఆర్టీఏ ఏజెంట్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో లైసెన్స్ ఉన్న ఆర్టీఏ ఏజెంట్ ద్వారా ఏటా ఫిట్‌నెస్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. 2024–25కు సంబంధించిన ఫిట్‌నెస్ ట్యాక్స్‌ను చెల్లించేందుకుగాను సదరు ఏజెంట్ అకౌంట్‌లో రూ.70 లక్షల మేర నిధులను జీవీఎంసీ మళ్లించింది. ఆ మొత్తాన్ని వెంటనే ఫిట్‌నెస్ ట్యాక్స్ కోసం చెల్లించి, ఆ కాగితాలను జీవీఎంసీకి ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారాలన్నీ జీవీఎంసీలో మెకానికల్ సెక్షన్ చూసే ఈఈ పర్యవేక్షిస్తుంటారు. ఇందుకు భిన్నంగా జీవీఎంసీ నుంచి తన అకౌంట్‌లోకి వచ్చిన నిధుల్లో నుంచి కేవలం రూ.30 లక్షలు మాత్రమే ట్యాక్స్ కోసం చెల్లించి... మిగిలిన నిధులను సొంతానికి వాడుకున్నారు. అయితే, కలర్ జిరాక్సులు పెట్టి వ్యవహారం నడిపిద్దామనుకునే సమయానికి ఇందులో ఆరు వాహనాలు యాక్సిడెంట్‌కు గురై రిపేరుకు వచ్చాయి. వీటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌సీ) లేకపోవడంతో ఇన్సూరెన్స్ వర్తించదని బీమా కంపెనీ తేల్చిచెప్పింది. దీంతో రూ.50 లక్షలతో వీటికి మరమ్మతులు చేయించారు. దీంతో అసలు బండారం బయటకు వచ్చింది. మరోవైపు చెత్త తరలింపు హుక్ లోడర్ వాహనం కూడా గత 8 నెలలుగా టాటా షోరూంలోనే ఉంది. దీనికి కూడా ఎఫ్‌సీలు, ఇన్సూరెన్స్ లేకపోవడంతోనే మరమ్మతు చేయించకుండా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. యాక్సిడెంట్‌కు గురైన జీవీఎంసీకి చెందిన వాహనాలకు గత 8 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాలేదంటే ఏ స్థాయిలో ఈ గోల్‌మాల్ జరిగిందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment