ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా విశాఖ
● సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించండి ● ఓ యజ్ఞంలా ప్లాస్టిక్ నియంత్రణ ● ‘సాక్షి’తో జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్
‘ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను చూడాలి. దీనికి ప్రజల సహకారం చాలా అవసరం. ప్రపంచాన్ని శాసిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ నిషేధాన్ని యజ్ఞంలా భావించాలి. భావితరాలకు మంచి భవిష్యత్తు అందించాలి. ప్లాస్టిక్ అనర్థాలపై ఐదేళ్లుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. జనవరి ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాం. ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని సూచిస్తున్నాం. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, అధికార యంత్రాంగంతో కలిసి ఇప్పటికే కార్యాచరణ చేపట్టాం. ప్రజల్లో క్రమంగా మార్పు వస్తోంది. ప్లాస్టిక్ నియంత్రణలో ప్రజలూ భాగస్వామ్యం కావాలి’ అని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్ అన్నారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
డాబాగార్డెన్స్ : ప్లాస్టిక్ నిషేధానికి ఆరు దశల్లో చర్యలు చేపట్టాం. ముఖ్యంగా రీసైక్లింగ్‌కు సాధ్యం కాని ప్లాస్టిక్ నిషేధానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. 120 మైక్రాన్ల మందం కన్నా తక్కువ ఉన్న..రీసైక్లింగ్‌కు సాధ్యం కాని ప్లాస్టిక్‌ను నిషేధించాం. దాదాపు ఎనిమిది వారాల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. జీవీఎంసీ పరిధిలో 55 వేల దుకాణాలు..33 వేల మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. వారందర్నీ జీవీఎంసీ అధికారులు, సిబ్బంది నేరుగా కలిసి నిషేధిత ప్లాస్టిక్‌పై సూచనలు..ఆదేశాలిచ్చారు. విశాఖ మహానగరానికి నిత్యం 15 టన్నుల ప్లాస్టిక్ వస్తోంది. ఎక్కువగా విజయనగరం జిల్లా నుంచి వస్తోంది. ఆ ఉత్పత్తిని కంట్రోల్ చేసేందుకు విజయనగరం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాం. ప్లాస్టిక్ నియంత్రణలో జీవీఎంసీ 3వ దశలో ఉంది. ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా విశాఖను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపేందుకు అనేక చర్యలు చేపడతున్నాం.
డోర్ టు డోర్ క్యాంపైన్..
ఇక నుంచి ప్రతి నెలా 15 రోజుల పాటు డోర్ టు డోర్ క్యాంపైన్ నిర్వహించనున్నాం. అందుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్..శానిటరీ సిబ్బందిని భాగస్వామ్యం చేస్తున్నాం.
నిబంధనలు మీరితే..
నిబంధనలు మీరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించే చిరు వ్యాపారులకు మొదటి సారి రూ.2,500, రెండోసారి రూ.5వేలతో పాటు వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం. జీఎస్టీ పరిధిలోని వ్యాపారస్తులు మొదటిసారి పట్టుబడితే రూ.20వేలు, రెండోసారి పట్టుబడితే రూ.40వేలు, వ్యాపార లైసెన్స్ రద్దు చేసి.. కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
సోషల్ మీడియా ద్వారా..
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విస్తృత ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో సమీక్షించాం. ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా ప్రత్యామ్నాయమైన స్టీల్, గాజు, పింగాణి, పేపర్, వస్త్ర, నార వస్తువులు వినియోగించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాం.
నియంత్రణకు కమిటీలు
నిషేఽధిత ప్లాస్టిక్ నియంత్రణకు కమిటీలు వేశాం. వార్డు, జోనల్ స్థాయి, జీవీఎంసీ స్థాయిలో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు ఆదేశాలివ్వడం జరుగుతోంది. ప్రజల అవగాహనతోనే నియంత్రణ ముడిపడి ఉంది. టోటల్ ప్లాస్టిక్ బ్యాన్ కాలేదు. 120 మైక్రాన్ల మందంలోపు ప్లాస్టిక్‌ను నియంత్రిస్తున్నాం. జీవీఎంసీ పరిధిలో 330 కిలోమీటర్ల మేర 1.2 మీటర్ల వెడల్పున కాలువలున్నాయి. 3 మీటర్ల ఎత్తులో మెస్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment