ప్రజావ్యతిరేక పాలన
● ప్రజలు మోయలేనంతగా విద్యుత్ చార్జీలు
● అమలుకాని సంక్షేమ పథకాలు
● భరోసా లేని సాగు
● పరిశ్రమల మూతతో ఉపాధికోల్పోతున్న కార్మిక కుటుంబాలు
● కూటమి ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన మాజీ ఎంపీ బెల్లాన, మాజీ ఎమ్మెల్యే బొత్స
గజపతినగరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని, కష్టాలే మిగుల్చుతోందని విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యుడు బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. గజపతినగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఖరీఫ్ ముగిసినా రైతులకు రూ.20వేల పెట్టుబడి సాయం అందలేదని, ధాన్యం దళారులకే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
భీమసింగ్ సుగర్ ఫ్యాక్టరీని తెరిపించి నిరుద్యోగులకు పని కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేశ్‌లు అధికారంలోకి వచ్చిన తరువాత నోరు మెదపడంలేదని మండిపడ్డారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా కనీసం ఆలోచన చేయడంలేదన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో 1200 మందికి ఉపాధి కల్పించే జీడిపిక్కల ఫ్యాక్టరీ మూతపడినా కనీసం మంత్రి స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరుపల్లిలో 80 ఎకరాలు, రోళ్లవాకలోను 50 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరిట సొంత మనుషులకు కట్టబెట్టేందుకు నేతలు ఆలోచన చేయడం దారుణమన్నారు. తల్లికి వందనం, ఫీజురీయింబర్స్‌మెంట్, ఉచిత బస్సు తదితర పథకాలకు మంగళం పాడుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల, జేఎన్‌టీయూ వర్సిటీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్, ఫిషింగ్ హార్బర్ వంటి ప్రగతి కేంద్రాల స్థాపన ఘనత వైఎస్సార్‌సీపీదేనని అన్నారు. కార్యక్రమంలో గజపతినగరం జెడ్సీటీసీ సభ్యుడు గారతవుడు, పార్టీ మండలాధ్యక్షుడు బూడి వెంకటరావు, ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మంత్రి అప్పలనాయుడు, సీనియర్ నేతలు మండల సురేష్, కరణం ఆదినారాయణ, బెల్లాన త్రినాథరావు, కందితిరుపతి నాయుడు, కర్రి రామునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment