ఘనంగా గణతంత్ర వేడుకల నిర్వహణ
వనపర్తి: గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్రీడా ప్రాంగణంలో గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చే అతిథులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు కూర్చోడానికి తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు. తాత్కాలిక వైద్య శిబిరం, తాగునీరు, మౌలిక వసతులు సమకూర్చాలని కోరారు. వేదిక ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకోవాలని, స్వాతంత్య్ర సమరయోధుల సన్మానం, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన, జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పక్కాగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, ఏఓ భానుప్రకాష్, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, పుర కమిషనర్ పూర్ణచందర్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment