బాలికల అభ్యున్నతితో దేశాభివృద్ధి
అమరచింత: బాలికల అభ్యున్నతితో దేశాభివృద్ధి సాధ్యమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వి.రజని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని దేశాయి మురళీధర్‌రెడ్డి మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో బాలురతో పాటు బాలికలను సమానంగా చూస్తూ అవకాశాలు కల్పిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు. బాలికలు అన్నిరంగాల్లో రాణించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తోడ్పాటునందించాలని కోరారు. వారికి అవసరమైన వనరులు, వసతులు కల్పిస్తే అవకాశాలను అందిపుచ్చుకొని సమాజ శ్రేయస్సులో భాగస్వాములయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాలికల కోసం ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయని, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలను ఆమె ప్రారంభించారు. భవిత కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లీగల్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, ఎంఈఓ భాస్కర్‌సింగ్, ప్రధానోపాధ్యాయురాలు కళావతమ్మ, కరుణాకర్, పారా లీగల్ వలంటీర్లు అహ్మద్, రాజేంద్రకుమార్, కలంపాషా, భవిత కేంద్రం నిర్వాహకురాలు స్వప్న, లోక్ ఆదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment