రబీ మొక్కజొన్న సాగుకు ఇదే అదును
చింతలపూడి: మొక్కజొన్న పంటను ఆహార పంటగానే కాకుండా దాణా రూపంలోను, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగాను ఉపయోగిస్తున్నారు. రబీ సీజన్‌లో మొక్కజొన్న పంటను విత్తుకోవడానికి ఇదే సరైన సమయమని వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు బి నాగకుమార్ రైతులకు సూచిస్తున్నారు.
ఎలాంటి నేలలు అనువు
మొక్కజొన్న సాగుకు మురుగు పోయే లోతైన ఎర్ర గరప, మధ్యస్థ నేలలు బాగా అనుకూలం. రబీ సీజన్‌లో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30లోగా విత్తితే ఎక్కువ దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. వరి మాగాణి తరువాత జీరో టిల్లేజ్ పద్ధతిలో డిసెంబర్ చివరి వరకు రైతులు విత్తుకోవచ్చు. హైబ్రీడ్ విత్తనాలైతే ఎకరానికి 8 కేజీల విత్తనాలు సరిపోతాయి. విత్తటానికి ముందు నేలను 3, 4 సార్లు నాగలితో దుక్కి దున్నాలి. ఎకరానికి 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. తరువాత బోదె నాగలితో బోదెలు, కాలువలు చేసుకోవాలి. 8 కేజీల విత్తనానికి 24 గ్రాముల మాంకోజెబ్ పొడి మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే లేత దశలో తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. విత్తనాలను చాళ్ళ మధ్య 60 సెం.మీటర్ల దూరంలో, మొక్కల మధ్య 20 సెం.మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. మొలకెత్తిన 10 రోజుల తరువాత ఒక మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి.
ఎరువుల వాడకం
భూసార పరీక్షల ఫలితాలను అనుసరించి ఎరువులను వాడుకుంటే నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్, 96 కేజీల నత్రజని, 32 కేజీల భాస్వరం, 32 కేజీల పొటాష్ ఇచ్చే ఎరువులను వాడుకోవాలి. మొక్కల్లో జింక్ లోపం కనిపించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి.
కలుపు నివారణ ఇలా..
పంట విత్తిన 2, 3 రోజుల్లోపు అట్రాజిన్ అనే కలుపు మందును ఎకరాకు 800 గ్రా 200 లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వలన కలుపు మొక్కలను నెల రోజుల వరకు అదుపు చేయవచ్చు. విత్తిన 30 రోజుల్లోపల వెడల్పాటి కలుపు మొక్కలను గమనిస్తే 2, 4–డీ సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాముల పొడి మందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
కాండం తొలుచు పురుగు
మొక్కజొన్న పంట మొలకెత్తిన 10, 20 రోజులకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటాయి. తరువాత ముడుచుకుని ఉన్న ఆకుల ద్వారా కాండం లోపలకు చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోతుంది. దీనిని డెడ్‌హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలు ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని ఆశించడం వలన దిగుబడి తగ్గిపోతుంది.
నివారణ
మొక్కజొన్న నాటిన 20–30 రోజులకు కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున ఆకుల సుడుల్లో వేయడం ద్వారా కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా నిలువరించవచ్చు.
పాడి–పంట
Comments
Please login to add a commentAdd a comment