జీతాల్లేవు.. అప్పులే దిక్కు
భీమవరం (ప్రకాశంచౌక్) : పారిశుద్ధ్య కార్మికులుగా ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పటికీ నెలల తరబడి జీతాలు రాకపోయే సరికి కుటుంబ పోషణ, ఇంటి అద్దెల కోసం అప్పులు చేస్తున్నారు. నెలకు అసలు జీతం రూ.16 వేలు కాగా మినహాయింపులు పోను రూ.11,850 వారి చేతికి వస్తుంది. పీఎఫ్ కోసం వారి జీతం నుంచి మినహాయించిన సొమ్మును కూడా పీఎఫ్ ఖాతాకు జమ చేయకపోవడం దారుణం. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జీతం వస్తుందనే ఆశతో కార్మికులు విధులకు హాజరై ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచే పనులు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న కష్టాలు పట్టడం లేదు. జీతాల కోసం ఎవరిని అడగాలో తెలియక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో సుమారు 70 మంది కార్మికులు
పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఏరియా ఆసుపత్రులు, ఒక జిల్లా ఆసుపత్రి, పెనుగొండ, ఆచంట, ఆకివీడు కమ్యునిటీ హెల్త్ సెంటర్లు కలుపుకొని మొత్తం 8 పెద్దాసుపత్రులు ఉన్నాయి. వాటిలో 70 మంది వరకూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, తణుకు ఆస్పత్రిలో ఉండాల్సిన పారిశుద్ధ్య కార్మికులకంటే 10 శాతం తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాంతో పనిభారం ఎక్కువగా ఉంది. దానికి తోడు ఆసుపత్రి అధికారుల, వైద్యుల వేధింపులను భరిస్తున్నారు.
గత ప్రభుత్వంలో పెరిగిన జీతాలు
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచి ఆదుకున్నారు. అప్పటి వరకూ రూ.6 వేలు ఉన్న జీతాన్ని రూ.16 వేలకు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెంచారు. ఆయన జీతాలు పెంచడమే గాకుండా కాంట్రాక్టర్ల ద్వారా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు అందించారు.
ఒకట్రెండు నెలలు జీతం రాకపోతే అల్లాడిపోతాం. అలాంటిది ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు(కాంట్రాక్ట్) గత 7 నెలలుగా జీతాలు లేవు. దీంతో అప్పులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఆ అప్పులు కూడా పుట్టని పరిస్థితి. ప్రభుత్వాసుపత్రుల్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో వీరు ఎంతో కీలకం. అలాంటి కార్మికులకు ఈ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకుండా గత 7 నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ 7 నెలల కాలంలో ఒక్కొక్కరికి రూ.66 వేల నుంచి 70 వేల జీతాలు బకాయిలు పెట్టారు.
7 నెలలుగా కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు అందని జీతాలు
ఒక్కొక్కరికి రూ.60 వేల నుంచి రూ.70 వేల బకాయిలు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
గత ప్రభుత్వంలో జీతాలు పెంచి సకాలంలో అందించిన వైనం
7 నెలల నుంచి జీతాలు లేవు
మాకు గత 7 నెలలుగా జీతాలు లేవు. దాంతో బతుకు దెరువుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పని చేస్తున్నాం కాని జీతాలు రాకపోవడంతో ఎలా బతకాలో తెలియడం లేదు. ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.66 వేలు జీతం బకాయి ఉంది. ఎప్పటికి జీతాలు చెల్లిస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మా గురించి పట్టించుకునే అధికారే లేడు. ఇలాగైతే మేం ఎలా బతకగలం. వెంటనే మా బకాయిలు చెల్లించాలి.
– ఎం.మంగ, పారిశుధ్య కార్మికురాలు
అప్పులు చేసి బతుకుతున్నాం
ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న మాకు సకాలంలో జీతాలు రాకపోవడంతో అప్పులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. గతంలో నెల నెలా మాకు జీతాలు అందేవి. గత ఏడు నెలలుగా జీతాలు పెడింగ్‌లో పెట్టారు. పేద, మధ్య తరగతికి చెందిన మేం ఈ జీతాల మీదే ఆధారపడి బతుకుతున్నాం. అలాంటిది మాకు జీతాలు నిలుపుదల చేస్తే ఎలా కుటుంబాలను పోషించుకోవాలి. ప్రభుత్వం వెంటనే మా బకాయిలు చెల్లించాలి.
– యు.దుర్గ, పారిశుధ్య కార్మికురాలు
Comments
Please login to add a commentAdd a comment